Friday, November 22, 2024

దిగొచ్చిన కేంద్రం.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా లెక్క తేల్చలని కేఆర్‌ఎంబీకి ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణా నదీ జలాల కేటాయింపులు, నదీపై ఉన్న ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు కేంద్ర జలశక్తిశాఖ తలొగ్గింది. కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం… తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా కేటాయింపు దిశగా కేఆర్‌ఎంబీని ఆదేశించింది. దీంతో కృష్ణా జలాల వినియోగంపై నివేదికకు రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని కేఆర్‌ఎంబీ నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, ఇద్దరు జెన్‌కో ప్రతినిధులతోపాటు కేఆర్‌ఎంబీ నుంచి ఇద్దరు అధికారులను బోర్డు నియమించింది. శ్రీశైలం, సాగర్‌ పంప్‌హౌస్‌ నిర్వహణపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. అదే సమయంలో కేంద్ర జలసంఘం నిబంధనల అమలుపైనా నివేదిక ఇవ్వాలని కమిటీని బోర్డు ఆదేశించింది.

అదనపు జలాల పంపకానికి డీ మార్కేషన్‌పై నెలలోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఎంత త్వరగా కమిటీ నివేదిక ఇస్తే పరిశీలించి ఆమోదించే యోచనలో కేఆర్‌ఎంబీ ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్‌లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం బోర్డు ప్రత్యేక రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎంత శాతం ప్రాతిపదికన ఏపీ, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులు జరుగుతాయన్న విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రస్తుతం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 812 టీఎంసీల కృష్ణా జలాలను 66:34 శాతం చొప్పున తెలంగాణకు 299(34శాతం) టీఎంసీలను మాత్రమే కేటాయిస్తున్నారు. అయితే 50:50 శాతం ప్రాతిపదికన 400 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోంది. తెలంగాణ ఏర్పాటైన మొదటి ఏడాది 2015లోనే సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తిశాఖ అభ్యర్థన పెట్టుకుంది. అయితే కేంద్రం స్పందించకపోవడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత కేంద్రం హామీపై కేసును ఉపసంహరించుకుంది. అయినప్పటికీ కేంద్రం మాట మార్చి ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయకపోవడం, ఉన్న ట్రిబ్యునల్‌కు సమస్యను విన్నవించక పోవడంతో తెలంగాణకు కృష్ణా బేసిన్‌ అవసరాలకు అందాల్సిన సాగు నీరు అందడం లేదు. ఇదే సమయంలో కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న కర్ణాటక చేపట్టే కొత్త ప్రాజెక్టులకు కేంద్రం వెంట వెంటనే అనుమతులను ఇస్తోంది. దీంతో కృష్ణా బేసిన్‌లో ఎక్కువ ఆయకట్టు ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement