ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. డ్యాంలో కనిష్ట స్థాయిలో నీటిని నిలువ చేసుకుని ఐదు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా విడుదలైన నీరు నురగలు కక్కుతూ సాగర్ వైపు పరుగులు తీస్తుంది. ఇక ఇదే సమయంలో శ్రీశైలం డ్యామ్ కు ఎగువ జూరాల నుంచి 1.48 లక్ష క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజ్ 77,919 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతుంది.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుత నీటిమట్టం 884.10 అడుగులుగా ఉంది. ఇక జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తికి గాను ఏపీ పరిధిలో 31299 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. ఇక గేట్ల ద్వారా 1,39,365 క్యూసెక్కుల నీరు దిగవకు వెళ్తుంది. మొత్తంగా శ్రీశైలం జలాశయం నుంచి 2.01 లక్షల నీరు విడుదలవుతుంది. శ్రీశైలం డ్యాం నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో జలాశయం వద్ద పర్యాటకుల శోభ నెలకొంది. డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తారు. వీటికి తోడు శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సెలవు రోజు కావడంతో తమ కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున భక్తులు పర్యాటకులు శ్రీశైలంకు చేరుకోవడం గమనార్హం.