Thursday, November 21, 2024

కృష్ణమ్మ పరవళ్ళు.. పొంగి పొర్లుతున్న శ్రీశైలం

అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణమ్మ పొంగి పొర్లుతోంది..శ్రీశైలం పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికపుడు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజిలు గరిష్ట నీటి మట్టానికి చేరువవుతున్నాయి. గురవారం రాత్రికి శ్రీశైలంకు ఎగువ నుంచి 2,24,532 క్యూసెక్కుల వరద ఇన్‌ ప్లnో రూపంలో వచ్చి చేరుతోంది. ఈ సీజన్‌ లో రెండు లక్షలకు పైగా ఇన్‌ ప్ల రావటం ఇదే మొదటి సారి. దీంతో కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూనే శ్రీశైలం ప్రాజెక్టులో ఒక గేటును ఎత్తి 91,683 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుదుత్పాదన చేస్తూ ఒక్కొక్క కేంద్రం ద్వారా 30 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌ కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులకు గాను 884.12 టీఎంసీలకు చేరింది. 215.81 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ద్యానికి గాను 210.51 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి వరదను దిగువకు విడుదల చేస్తున్న కొద్దీ నాగార్జున సాగర్‌ కూడా క్రమేపీ గరిష్ట నీటి మట్టానికి చేరువవుతోంది. 312.05 టీ-ఎంసీలకు గాను 237.3 టీఎంసీల నిల్వలు అందుబాటులోకి వచ్చాయి.

సాగర్‌ దిగువన పులిచింతల కూడా క్రమేపీ నిండుతోంది. 45.77 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్ద్యానికి గాను 38.85 టీఎంసీల నిల్వలున్నాయి. ప్రాజెక్టుల నుంచి నీటిని బ్యాలన్సింగ్‌ రిజర్వాయర్లకు పంపింగ్‌ చేస్తున్నారు. గోరకల్లు బ్యాలన్సింగ్‌ రిజర్వాయర్‌, గాజులదిన్నె ప్రాజెక్టు, బుగ్గవాగు రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసి నిల్వ చేస్తున్నారు. పులిచింతల దిగువన ప్రకాశం బ్యారేజ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వతో నిండుకుండను తలపిస్తోంది. 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వను బ్యారేజ్‌ లో స్థిరంగా ఉంచుతూ ఎగువ నుంచి వచ్చి చేరుతున్న అదనపు నీటిని ఎప్పటికపుడు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ లో గురువారం రాత్రికి 2568 క్యూసెక్కుల ఇన్‌ ప్లnో ఉండగా..అదే స్థాయిలో నీటిని అవుట్‌ రూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎగువన తుంగభద్ర, జూరాల, ఆల్మట్టి, జైక్వాడి, నారాయణపూర్‌, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌, ఉజ్జయిని జలాశయాల నుంచి 2,46,534 క్యూసెక్కు వరద దిగువకు చేరుకుంటోంది. ఈ ప్రవాహం మరింత ఎక్కువైతే శ్రీశైలం ప్రాజెక్టు మరిన్ని గేట్లను ఎత్తి దిగువన నాగార్జున సాగర్‌ కు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement