Tuesday, November 19, 2024

కృష్ణమ్మ పరవళ్లు… శ్రీశైలం ప్రాజెక్టు 10గేట్లు ఎత్తివేత‌

కర్ణాటక, మహారాష్ట్ర ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతం జలకళ ఉట్టిపడుతోంది. మరోవైపు తుంగభద్ర పరవళ్ళు తొక్కుతోంది. దీంతో ఓవైపు కృష్ణమ్మ.. మరో వైపు తుంగభద్ర పొంగి ప్రవహిస్తూ శ్రీశైల పరమశివుడికి అభిషేకిస్తున్నాయి. నిండుకుండలా శ్రీశైలం నిండుకోవడంతో డ్యాంకు చెందిన 12 గేట్లలో 10 గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆ నీటి సోయగం పర్యాటకులను కనువిందు చేస్తోంది. తెలంగాణ లోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన వస్తోన్న వరదనీటితో కళకళలాడుతుంది. దీంతో జూరాల ప్రాజెక్ట్‌ స్పిల్ వే గేట్ల ద్వారా 2.28 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో అదే స్థాయిలో ఉంది. ఇక ఇదే సమయంలో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం జోరుగా సాగుతుంది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 1631.60 అడుగులుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 105 టీఏంసీలు గాను ప్రస్తుత నీటినిల్వ 100.211 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 143577 క్యూసెక్కులు వస్తుండగా, అవుట్ ఫ్లో 164090 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఇదే సమయంలో కాలువలకు 10,593 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది.

పైనుండి వరదనీరు ఉధృతంగా వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండుకుంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి, నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీళ్లు.. పాలనురుగుతో శ్రీశైలంలో సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ప్రస్తుతం శ్రీశ్రైలం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,64, 683 క్యూసెక్కులుగా, ఔట్‌ ఫ్లో 3,40 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుతుతోంది. ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ కేంద్రం నుంచి 30,624 క్యూసెక్కుల వినియోగంతో 16.374 మెగా యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 33,715 క్యూసెక్కుల నీటి వినియోగంతో 17.059 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు గాను, 211,4759 టీఎంసీలుగా నిల్వ ఉంది. 2007, 2009, 2021 తర్వాత ఆగస్టులో ప్రాజెక్టు పూర్తిగా నిండటం, గేట్లు ఎత్తడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement