Friday, November 22, 2024

కృష్ణా జలాల పంపిణీ వివాదం.. కొత్త ట్రిబ్యునల్‌ వాదనలకు కేంద్రం చెక్‌

అమరావతి, ఆంధ్రప్రభ : కృష్ణా జలాల పంపిణీ వివాదాల పరిష్కారం కోసం కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలన్న వాదనలకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా ముగింపు పలికింది. బ్రిజేష్‌ కుమార్‌ నేతృత్వంలో ప్రస్తుతం మనుగడలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యుడీటీ-2)ను వచ్చే ఏడాది 2024 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్ర జలశక్తి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్రాష్ట జల వివాద పరిష్కార చట్టం – 1956లోని సెక్షన్‌ 5(3) కింద తనకున్న అధికారాలను ఉపయోగించి ట్రిబ్యునల్‌ కాల పరిమితిని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు 1తో ముగియనున్న -టైబ్యునల్‌ కాల పరిమితిని మరో ఎనిమిది నెలలు పొడిగించటం ద్వారా కృష్ణా నీటి కేటాయింపులపై తమ వాదనలకు బలం చేకూరినట్టేనని ఏపీ భావిస్తోంది.

తెలంగాణ మాత్రం కొత్త ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేసే దాకా ఇపుడున్న ట్రిబ్యునల్‌ అవార్డును నోటిఫై చేయటానికి వీలు లేదనీ, కృష్ణా జలాలను ప్రస్తుతం అమల్లో ఉన్న 66:34 వాటాలతో కాకుండా 50:50 ప్రాతిపదికన పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కొంతకాలంగా దీనిపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. కృష్ణా బోర్డు సైతం నీటి వాటాలపై తుది నిర్ణయాన్ని కేంద్ర జలశక్తికి అప్పగించింది. కొత్త ట్రిబ్యునల్‌ వాదనలపై గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం సూచనలతో సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని తెలంగాణ ఉపసంహరించుకున్నా కృష్ణా జలాల పంపిణీ వివాదం కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ గడువును వచ్చే ఏడాది మార్చి వరకు ఫొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాల్లో వాటాలపై నెలకొన్ని వివాదాలు ఇప్పటికపుడు పరిష్కారమయ్యే అవకాశమే లేదనీ, పాత ట్రిబ్యునల్‌ అవార్డులను తిరగదోడే అధికారం చట్టబద్ధంగా ఎవరికీ లేదన్న ఏపీ వాదనలకు న్యాయపరంగా బలంగా చేకూరటం వల్లనే ట్రిబ్యునల్‌ గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పడినా పాత ట్రిబ్యునల్‌ తీర్పులను మార్చటం, సమీక్షించటం కుదరదు.. ట్రిబ్యునల్‌ తీర్పులు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని జలవనరుల నిపుణులు చెబుతున్నారు.

అవే కేటాయింపులు..మార్పులుండవు

కృష్ణాలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన చెందిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నీటి పంపిణీ నిర్వహణ, నియమావళి (రూల్‌ కర్వ్స్‌) ముసాయిదాను కూడా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డుకు లోబడి రూపొందించింది. కృష్ణాలో 75 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుని 811 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి.. దీనిలో 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత కల్పించాలి.. సాగునీటి అవసరాలు కూడా తీరాకే విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది.

జులై 1 నుంచి అక్టోబరు 31 వరకు శ్రీశైలం కనిష్ట నీటి మట్టం 854 అడుగులు ఉండాలి. అంతకన్నా తక్కువ నీటి మట్టం నమోదై ఉన్న సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తి కోసం నీటిని తరలించకూడదని ముసాయిదా నివేదికలో సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ -1 (కేడ డబ్ల్యుడీటీ – బచావత్‌ ట్రిబ్యునల్‌) అవార్డును అనుసరించి 66:34 శాతం మేరకే కేటాయింపులుంటాయని కేంద్ర జలశక్తి కృష్ణా బోర్డుకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

అదనపు జలాల పంపిణీకే పరిమితి

బచావత్‌ తరువాత ఏర్పడిన కృష్ణా ట్రిబ్యునల్‌ – 2 కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటులోకి వచ్చే 163 టీఎంసీలు, వరదల సమయంలో ఒనగూరే 285 టీఎసీంసీల మిగులు జలాలు.. మొత్తం 448 టీఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటకలకు పంపిణీ చేసే బాధ్యతలు మాత్రమే చేపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్‌ రాష్ట్ర నదీ వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ) 1956 చట్టంలోని సెక్షన్‌6(2) ప్రకారం కొత్త ట్రిబ్యునళ్ళు పాత ట్రిబ్యునల్‌ ఆదేశాలను పున: సమీక్షించటం చట్టరీత్యా సాధ్యం కాదు.. అందువల్లనే బ్రజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ కృష్ణాలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా అదనంగా అందుబాటులోకి వచ్చే 163 టీఎంసీలు, వరదల సమయంలో ఒనగూరే 285 టీఎసీంసీల మిగులు జలాలు.. మొత్తం 448 టీఎంసీలను ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు పంచే విషయానికే పరిమితమైందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది కృష్ణా ట్రిబ్యునల్‌ -2 రద్దయి కొత్త ట్రిబ్యునల్‌ -3 ఏర్పాటయినా పాత ట్రిబ్యునల్‌ అవార్డులను తిరగదోడటం సాధ్యం కాదని వెల్లడిస్తున్నారు. సీడబ్ల్యూసీ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement