మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. కృష్ణకు సన్నిహితులు. ఆ అభిమానంతోనే 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో హస్తం పార్టీ తరఫున ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికల్లో మరోసారి ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ హత్యకు గురవడం.. ఏలూరులో ఓటమితో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత.. తెలుగు దేశం, ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పలు సినిమాలు చేశారు. 2010 తర్వాత క్రమంగా సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. 2016లో వచ్చిన ‘శ్రీ శ్రీ’ కృష్ణ నటించిన చివరి చిత్రం.
1987 సంవత్సరం.. మండల ఎన్నికలు
టీడీపీ అధికారంలో ఉంది. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణను ఎన్నికల ప్రచారం కోసం నంద్యాలలో మీటింగ్ పెట్టించారు. మీటింగ్ అయ్యాక కృష్ణను కర్నూలు వరకు డ్రాప్ చేయడానికి సాయంత్రం 6 గంటలకు నంద్యాలలో 20 మంది కాంగ్రెస్ యూత్ రెండు జీపుల్లో కృష్ణకు ఎస్కార్ట్ గా కర్నూలుకు బయలుదేరారు. పాణ్యంలో టీడీపీ వాళ్ళు కృష్ణ పై రాళ్లు విసిరారు. వెంటేనే కాంగ్రెస్ యూత్ సభ్యులు జీపులు దిగి ఆ చీకట్లోనే టీడీపీ వాళ్లపై రాళ్లతో ఎదురు దాడి చేశారు. కానీ మెటాడోర్ లో ఉన్న కృష్ణ కుడి కనుబొమ్మకు రాయి బలంగా తగిలింది. కృష్ణ పి.ఎ రాంప్రసాద్ కర్చీఫ్ అడ్డం పెట్టి ప్రయాణం మొదలుపెట్టి…
కర్నూలు ఊరి బయట కొండ మీద రాత్రి 8.30 కి ఆగారు. కుడి కంటి పైన రక్తం కారుతున్నా… మీకేం కాలేదు కదా అని ఆయన వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులందరినీ పిలిచి అడిగాడు. కర్నూలు నుండి వచ్చిన డాక్టర్లు కట్టు కట్టారు. అక్కడి నుంచి కర్నూలు నార్త్ వైపు హైదరాబాద్ దారిలో కృష్ణను సెండాఫ్ చేసి కాంగ్రెస్ యూత్ సభ్యులు వెలుతిరిగారు.
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం శ్రీపొట్టి శ్రీరాములు దీక్షలో…
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం శ్రీపొట్టి శ్రీరాములు దీక్ష చేస్తుంటే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ (చెన్నైలో ఉండేది) నుండి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చే వారు కాదు. కానీ మొదటిసారిగా కృష్ణ ధైర్యంగా ముందుకు వచ్చి పొట్టి శ్రీరాములుకి మద్దతుగా కూర్చున్నారు.