Tuesday, November 26, 2024

Water Matters | వరదలొచ్చే వేళ కృష్ణా బోర్డు ఆంక్షలు.. సాగు, తాగునీటికే ప్రాధాన్యం

అమరావతి, ఆంధ్రప్రభ : రుతు పవనాలు మొదలయ్యాయి.. కృష్ణాకు ఎగువన కర్ణాటకలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్ల్రోనూ అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఇపుడున్న అంచనాల ప్రకారం గత ఏడాది రెండు నుంచి మూడు వారాలు ఆలస్యంగా జులై 10 నుంచి 15 మధ్య కృష్ణాలో వరద ఉధృతి పెరగవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల మధ్య ప్రధాన వివాదంగా మారిన శ్రీశైలం, సాగర్‌ జలాలను వినియోగించుకుని చేసే విద్యుదుత్పత్తిపై ఈ ఏడాది కఠిన ఆంక్షలు విధించాలని కేంద్ర జలశక్తి నిర్ణయించింది. ఈ మేరకు జల విద్యుదుత్పత్తిపై బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రోటోకాల్‌ ను అమలు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.

విద్యుదుత్పత్తిపై తొలి నుంచి వివాదం రగులుతూనే ఉన్నా 2021-22, 2022-23 నీటి సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్ర మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. 2021-22 నీటి సంవత్సరంలో 218 టీ-ఎంసీలను 281 రోజులపాటు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వినియోగించుకుని 1217 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసిందనీ, 2022-23లోనూ అదే ధోరణితో వ్యవహరించినా కృష్ణా బోర్డు చర్యలు చేపట్టకపోవటం వల్ల తమ సాగునీటి ప్రయోజనాలు దెబ్బతిన్నాయని ఏపీ అంటోంది. ఈ దశలో 2023-24 నీటి సంవత్సరంలో జలవిద్యుదుత్పత్తి విషయంలో బచావత్‌ ప్రోటోకాల్‌ ను పాటించాలని కోరుతోంది.

- Advertisement -

కేంద్ర జలశక్తి, కృష్ణా బోర్డు కూడా విస్పష్టమైన మార్గ నిర్దేశకాలు అమలు చేయాలని భావిస్తున్నాయి. విద్యుదుత్పత్తి విషయంలో రెండు రాష్ట్రాల్ర మధ్య ఏకాభిప్రాయం సాధించి రూల్‌ కర్వ్స్‌ (నిబంధనలు, నియమావళి)ను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజింగ్‌ కమిటీ- (ఆర్‌ఎంసీ) సాంకేతికంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వరదలు రాకముందే విద్యుదుత్పత్తి విషయంలో మార్గదర్శకాల అమలుకు కృష్ణా బోర్డు సిద్ధమవుతోంది.

బచావత్‌ ప్రోటోకాల్‌ ఏం చెప్పింది..!

రిజర్వాయర్లలో నీటి వినియోగంపై బచావత్‌ ట్రైబ్యునల్‌ నిర్దిష్టమైన ప్రోటోకాల్‌ ను రూపొందించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ప్రోటోకాల్‌ ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి అవసరాలు ఉన్నపుడు మాత్రమే విద్యుదుద్పత్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. నదికి దిగువన ఉన్న రాష్ట్ర అవసరాల ఆధారంగానే ఎగువున ఉన్న రాష్ట్రం విద్యుదుత్పత్తి చేయాలి. దిగువ రాష్ట్ర అవసరాలతో సంబంధం లేకుండా విద్యుదుత్పత్తి చేసి నీటిని వదిలేస్తే అవన్నీ సముద్రం పాలవుతాయి..

ఏటా తెలంగాణ ఈ తరహా ఉల్లంఘనలకే పాల్పడింది. 2021-22 నీటి సంవత్సరంలో ఏపీకి సాగునీటి అవసరాలు లేని సమయంలో జులై 2 నుంచి 20 వరకు కేవలం 18 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరే వరకు యధేచ్ఛగా ఎడమగట్టు పవర్‌ హౌస్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసింది. ఫలితంగా కేవలం 18 రోజుల్లోనే 11.3 టీఎంసీల నీరు సముద్రం పాలయింది. ఆ సమయంలో నీరు వృధా కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్ల్రో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందేదని అంచనా.

శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కన్నా తక్కువ నీరున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని ఆర్‌ ఎంసీ కన్వీనర్‌ ఆర్కే పిళ్ళై, బోర్డు సభ్యుడు ముయన్‌తంగ్‌ దృష్టికి గతంలో ఏపీ జలవనరుల శాఖ అదికారులు తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో విద్యుదుత్పత్తి నియమావళి, ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలన్నిటినీ క్రోడీకరించి ఈ ఏడాది కృష్ణా బోర్డు మార్గదర్శకాలు రూపొందించనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement