కొఠియా గ్రూపు గ్రామాలకు చెందిన గిరిజన నాయకులు సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి తరలివెళ్లారు. ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వరరావు ఆధ్వర్యంలో కొఠియా గ్రూపు గ్రామాల్లో ప్రధాన గ్రామాలైన గంజాయి భద్ర, పగులుచెన్నూరు, పట్టు-చెన్నూరు పంచాయతీలకు చెందిన గమ్మెల బిసు, చోడిపిల్లి బిసు, సర్పంచులు, వారి ప్రతినిధులు వెళ్లారు. సుప్రీంకోర్టు న్యాయవాది, హర్యానా అడ్వకేట్ జనరల్ విద్యాసాగర్ ద్వారా వాజ్యం దాఖలు చెయ్యనున్నారు. ఈసందర్భంగా ఆంధ్ర ప్రభ ప్రతినిధి రేగు మహేశ్వరరావుని సంప్రదించగా తాము ఇప్పటికే దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతితోపాటు- ప్రధానమంత్రి, ఎస్టీ కమిషన్ వారికి వినతిపత్రాలను పంపించామన్నారు.
అదేవిధంగా కొఠియా గ్రూపు గ్రామాల ప్రజల మనోభావాలను, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తమ అభివృద్ధి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలు, వాటి ద్వారా కొఠియా ప్రజలకు(గిరిజనులు)జరుగుతున్న మేలు తదితర అంశాలను వాజ్యంలో పేర్కొన్నామన్నారు. అంతేకాకుండా ఫిబ్రవరి 18న ఒడిశాలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఎవరూ పాల్గొనరు, పోటీ- చెయ్యరు, ఓటింగునకు వెళ్లరన్నారు. తామంతా ఆంధ్రాలోనే కొనసాగుతామంటూ గిరిజన నాయకులు, ప్రజా ప్రతినిధులు సుప్రీంకోర్టుకి వివరించాలన్నది గిరిజన నాయకులు ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..