నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వైఎస్ కుటుంబంతో మొదట్నుంచి సన్నిహిత సంబంధా లున్నాయి. ప్రత్యేకించి వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్ వెన్నంటే ఉన్నారు. ఈ నేపధ్యంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని జగన్ ఆయనకు కల్పించారు. అధినేత ఇచ్చిన అవకాశాన్ని కోటంరెడ్డి సద్వినియోగం చేసుకుంటూ నెల్లూరు రూరల్‌లో వరుసగా రెండు సార్లు వైసీపీ జెండాను రెపరెపలాడించారు. అలాగే ఆయన ప్రత్యేక కార్యక్రమాల పేరుతో నిరంతరం రూరల్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నా రు. నియోజకవర్గ పరిధిలో పేద ప్రజలకు సొంత నిధులు వెచ్చించి వారి సమస్యలను పరిష్కరిస్తూ పనిచేసే శాసనసభ్యునిగా గుర్తింపు తెచ్చుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికంటే ముందుగానే ఆయన నియోజకవర్గం పరిధిలోని ప్రతీ గడపకు వెళ్లి పల్లె నిద్ర కూడా చేశారు. ఇలా కోటంరెడ్డికి నియోజకవర్గంలో మరింత బలం పెరిగింది.
ఈ నేపధ్యంలో పార్టీలో అంతర్గత విభేదా లు తలెత్తాయి. నెల్లూరు సెంట్రల్ బ్యాంకు మాజీ చైర్మన్ ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రత్యేక వర్గంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకొన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందే అధికారిక సమావేశంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో ఆయన పార్టీ మారబోతున్నా రంటూ అప్పట్లో జోరుగా ప్రచారం కూడా నడిచింది. టీడీపీ, జనసేన నేతలు ఆయనతో సమావేశం కూడా అయ్యారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఈలోపే సీఎం జగన్ కోటంరెడ్డిని పిలిపించడంతో వివాదం సర్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే ఇంతలో ఏం జరిగిందో..ఏమో తెలియదు కాని ఆదివారం ఆయన మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై నిఘా పెట్టారని, నా సెల్‌ఫోన్ ట్రాప్ చేశారని ఆయన చేసిన వ్యాఖ్య లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులు నిఘా పెట్టడం ఏమిటం టూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చేసిన ఆరోపణలు కొత్త చర్చకు కూడా తెరలేపాయి.