కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి (24) అనుమానాస్పద మృతి కేసు కొలిక్కి వచ్చింది. నిందితులను ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు.. అరెస్ట్ అయిన వారిలో దీప్తి సోదరి చందన, ఆమె స్నేహితుడు, డ్రైవర్‌గా భావిస్తున్న మరో వ్యక్తి ఉన్నారు.
దీప్తి అనుమానాస్పద మృతి అనంతరం పారిపోయిన సోదరి చందన ఒంగోలు వైపు వస్తున్నట్లు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. టంగుటూరులో టోల్‌గేట్‌ను తప్పించుకుని ఆలకూరపాడు వైపు వెళ్లినట్లు గుర్తించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒంగోలులోని లాడ్జిలో వారిని పట్టుకుని జగిత్యాల పోలీసులకు అప్పగించారు. నిందితులను ఒంగోలు నుంచి జగిత్యాల తీసుకువచ్చి పోలీసులు విచారించారు.
కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక దీప్తి గత నెల 29న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఆమె చెల్లెలు చందన అదృశ్యమైంది. దీప్తి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి చందన సహా మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మ్యారేజ్ ప్లాన్‌లో భాగంగా.. అక్కకు వోడ్కా తాగించి చంపేసింది..
జగిత్యాల ఎస్పీ భాస్కర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం … కోరుట్లకు చెందిన బంక చందన 2019లో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది. ఉమర్ షేక్ సుల్తాన్(25) అనే యువకుడు చందనకు వన్ ఇయర్ సీనియర్. చందన రెండేండ్లు డిటెయిన్డ్ అయింది. ఉమర్ వన్ ఇయర్ డిటెయిన్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరు క్లాస్‌మేట్స్ అయ్యారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని ఎస్పీ పేర్కొన్నారు. అయితే ఉమర్ తో పెళ్లికి దీప్తితో సహా ఇంటిలోని వారంతా వ్యతిరేకించారు..అయినా చందన మ్యారేజ్ కోసం ప్లాన్ వేసింది. ఆగస్టు 28న కాల్ చేసి ఓ ఫంక్షన్ నిమిత్తం తమ పేరెంట్స్ హైదరాబాద్ వెళ్తున్నారు. ఇంట్లో తాను, అక్కనే ఉంటాం. ఇంట్లో మనీ, బంగారం ఉంది. అది తీసుకొని పోయి పెళ్లి చేసుకుంటే.. సెటిలవుతామని ఉమర్‌కు చందన చెప్పింది. ఆగస్టు 28న ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి 11 గంటలకు కోరుట్లకు ఉమర్ చేరుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా వోడ్కా, బ్రీజర్ తెప్పించింది చందన. రాత్రి సమయంలో దీప్తి, చందన కలిసి వోడ్కా, బ్రీజర్ తాగారు. రాత్రి 2 గంటల సమయంలో ఉమర్‌కు మేసేజ్ చేయడంతో ఇంటి వెనుకాల కారు ఆపి ఇంట్లోకి వచ్చాడు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీస్తున్న సమయంలో దీప్తికి మెలకువ వచ్చి లేచింది. గట్టిగా అరిచింది. చందన తన వద్ద స్కార్ఫ్‌తో దీప్తి మూతికి, ముక్కుకు చుట్టింది. ఆమె సోఫా మీద పడిపోయింది. ఉమర్, చందన కలిసి ఆమె చేతులు కట్టేశారు. గట్టిగా అరవకుండా మూతికి ప్లాస్టర్ వేశారు. పది నిమిషాల తర్వాత దీప్తిలో చలనం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
70 తులాల బంగారం, రూ. లక్షా 20 వేలతో పరార్..
అక్క అచేతన స్థితిలో ఉండిపోవడంతో ఇంట్లో ఉన్న ఒక లక్షా 20 వేల నగదు, 70 తులాల బంగారం బ్యాగులో వేసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దీప్తికి ప్లాస్టర్ తీసేసి వెళ్లారు. వోడ్కా తాగి చనిపోయినట్లు సీన్ క్రియేట్ చేశారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఉమర్ తల్లి, చెల్లి, బంధువుకు జరిగిన విషయం చెప్పి.. నగదు, బంగారంతో.. ముంబై, నాగ్‌పూర్ వెళ్లాలని చందన, ఉమర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకుని, సెటిల్ అవ్వాలని అనుకున్నారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఏ1 చందన, ఏ2 ఉమర్, ఏ3 సయ్యద్ అలియా, ఏ4 ఫాతిమా, ఏ5 హాఫీజ్‌గా చేర్చామని తెలిపారు. ఈ ఐదుగురిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు.