Sunday, November 24, 2024

TG | తెలంగాణాకు కొరియా షూ కంపెనీ !

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభబ్యూరో: తెలంగాణలో పెట్టుబడులకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. మెడికల్‌, స్మార్ట్‌ బూట్ల ఉత్పత్తిలో అగ్రగామి కొరియన్‌ కంపెనీ షూఆల్స్‌ రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచింది. రూ.300 కోట్ల పెట్టుబడులతో సంస్థ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేసింది.

కంపెనీ ఏర్పాటుకు 750 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. కొరియా నుంచి వచ్చిన షూఆల్స్‌ ఛైర్మన్‌ చెవోంగ్‌లీతో పాటు సంస్థ ప్రతినిధులు గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబును కలిశారు. 87 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ”గిగా ఫ్యాక్టరీ” ప్రతిపాదనను ఆయన ముందుంచారు.

అడుగు భాగాన (సోల్స్‌) మెడికల్‌ చిప్‌ ఉండే బూట్లు, పదివేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే షూతో పాటు డయాబెటీస్‌, ఆర్థరైటిస్‌ ఉన్న వారికి ఉపశమనం, స్వస్థత కలిగించే పలురకాల ఉత్పత్తులతయారీ గురించి ప్రతిపాదనలు అందజేశారని మంత్రి వెల్లడించారు.

బూట్ల తయారీలో జంతువుల చర్మాన్ని వినియోగించడం వల్ల ట్యానరీలు అవసరమవుతాయని, ఇలా యాన్సిల్లరీ పరిశ్రమలతో అనేక మందికి ఉపాధి దొరుకుందని మంత్రి వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణా హబ్‌గా మారుతోందన్నారు.

- Advertisement -

5000 ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్ హెల్త్‌ సిటీ ఏర్పాటు…

అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ లాంటి ప్రఖ్యాత హాస్పిటళ్లను తీసుకురావడంతోపాటు పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్‌ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5,000 ఎకరాలు కేటాయిస్తే ఏషియాలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్‌ హెల్త్‌ సిటీని నెలకొల్పే ప్రతిపాదన కూడా కొరియా బృందం చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు.

స్మార్ట్‌ హెల్త్‌ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని అన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement