కుత్బుల్లాపూర్ (ప్రభ న్యూస్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీల్లో బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు
కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వార్డు ఉమామహేశ్వర కాలనీ, 1 వార్డు లోని అపర్ణ పామ్ గ్రూవ్, దూలపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో బీజేపీ నాయకులతో కలిసి ఇవ్వాల (శుక్రవారం) మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. ఉమా మహేశ్వర కాలనీలో వరద నీటిలోనే తిరుగుతూ బాధితులతో మాట్లాడారు. అపర్ణ పామ్ గ్రూవ్ వద్ద పొంగిపొర్లుతున్న వరద నీటిని పరిశీలించారు. దూలపల్లి – కొంపల్లి రోడ్డులో నత్త నడకన సాగుతున్న కల్వర్టు పనులను పరిశీలించారు.
వర్షాలు పడిన ప్రతిసారి ఉమామహేశ్వర కాలనీ ముంపునకు గురవుతుందని తెలిసి కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదని కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉమామహేశ్వర కాలనీ ముంపునకు గురై ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపినా.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కనీసం కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ఎమ్మెల్యే నివాసానికి కూత వేటు దూరంలో ఉన్నా ఇక్కడి వారి సమస్యలపై ఎన్నడూ పట్టించుకున్న పాపాన లేదన్నారు.
ఎమ్మెల్యే వివేకానంద్ తొమ్మిదేళ్లలో ఇక్కడి ముంపునకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని, ఇప్పటికైనా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, సీసీ రోడ్ల ఎత్తు పెంచాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, పార్టీ నేతలు ఆదిరెడ్డి రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, శివాజీ రాజా, సతీష్ సాగర్, రాజశేఖర్, సరితారావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.