హైదరాబాద్, ఆంధ్రప్రభ : మరో తెలంగాణ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దే మహాయజ్ఞానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు. జగిత్యాల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల ప్రత్యేక నిధిని విడుదల చేసింది. యాదాద్రి పునర్ నిర్మాణం చేసి తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దిన తరహాలోనే కొండగట్టును అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.
బుధవారం ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రూ.100 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. ఆగమ శాస్త్ర నిబందనల ప్రకారం దేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. సీఎం ప్రత్యేక చొరవతో త్వరలో కొండగట్టు దశా, దిశా మారిపోనుందని భక్తులు ఆశాభావంతో ఉన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన ప్రచార రథం వారాహికి కొండగట్టులో పూజలు చేయించారు. ఈ క్రమంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే మహాయాగాన్ని సీఎం కేసీఆర్ తలకెత్తుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ ఆలయానికి ప్రాశస్త్యంగా ఉంది.
ఆరు నెలల క్రితమే యాదాద్రిని విజయవంతంగా పూర్తి చేసిన సీఎం కేసీఆర్ అభివృద్ధి పై దృష్టిసారించారు. వేముల వాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆలయ అభివృద్ది పనులు తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగిస్తోంది. అదే తరహాలో కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందించిన ప్రభుత్వం రాబోయే 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా వసతుల కల్పనకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్‌కు ఆర్కిటెక్చర్లు డిజైన్ చేయనున్నారు. దీనికోసం ముక్తేశ్వర్ రూపొందించిన ప్రణాళికలను ఆర్కిటెక్టర్ ఆనందసాయ్ పరిశీలించినట్లు తెలిసింది. ఈ దేవాలయ నిర్మాణానికి 390 ఎకరాలకు పైగా భూములను కేటాయించనున్నారు.