Sunday, November 24, 2024

టీఆర్ఎస్‌లో చేరతా.. కానీ షరతులు వర్తిస్తాయి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి తాను టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్నానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అయితే అందుకు ఆయన ఓ కండిష‌న్ పెట్టారు. టీఆర్ఎస్‌లో ఈటెల రాజేందర్, హరీష్ రావు.. ఇద్దరూ తనకు ఇష్టమైన నేతలు అని చెప్పుకొచ్చిన కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి.. టీఆర్ఎస్ నాయ‌క‌త్వాన్ని హరీష్ లేదా ఈటెలకు ఇస్తే తాను మ‌ళ్లీ టీఆర్ఎస్‌లో చేరతానన్నారు. ఈటెల‌ను క‌లిసేందుకు చాలా రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నాన‌ని.. అపాయింట్‌మెంట్ కూడా కోరాన‌న్నారు కొండా. కానీ ఆయన నుంచి స్పందన లేదని తెలిపారు.

ఈటెల ఈ మ‌ధ్య కేసీఆర్‌పై ఓసారి అలుగుతున్నార‌ని.. మ‌రోసారి పొగుడుతున్నార‌ని కొండా గుర్తుచేశారు. ఈటెల ఒక‌వేళ టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందో తెలుసుకుందామ‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు చెప్పారు. త‌న అంచ‌నా నిజ‌మైతే బీసీ, ముదిరాజ్‌లతో కలిసి పార్టీ పెట్టాలని.. ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ ప్రోత్సహించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈటల సొంత పార్టీ పెడితే గొప్ప నాయకుడు అవుతాడని జోస్యం చెప్పారు. అలాకుండా ఆలస్యం చేస్తే.. కేసీఆర్‌తో కలసి ఈటెల డ్రామాలు ఆడుతున్నార‌ని అంద‌రూ అనుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement