ఇటీవల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామా చేసినప్పటి నుంచి కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా మారింది. కొండా కచ్చితంగా బిజెపి గూటికి చేరతారని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు షర్మిల పార్టీ వైపు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీని పెట్టబోతున్నారట. కొత్తపార్టీ అంటే పూర్తి కొత్తపార్టీ కాకుండా ఇప్పటికే రిజిస్టర్ ప్రజలలోకి రాని పార్టీల గురించి కొండా ఆలోచిస్తున్నారట. పార్టీలు పెట్టి ప్రజల మధ్యకు రాలేని పార్టీ వ్యవస్థాపకులతో ఇప్పటికే మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయశాంతి, అలే నరేంద్ర, దేవేందర్ గౌడ్, నాగం లాంటి వారు తెలంగాణ పేరుతో పార్టీలు పెట్టి… చివరికి మధ్యలోనే వదిలేశారు.
కానీ 2004లో పార్టీ పెట్టిన తెలంగాణ యువసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అడపా సురేందర్ ఇప్పటికి పార్టీని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అడపా సురేందర్, పార్టీ కి సంబంధించి వివరాలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి సేకరించే పనిలో ఉన్నారట. అన్నీ కుదిరితే కొండా తెలంగాణ యువసేన పార్టీతో ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.