హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ సందడి ప్రారంభం కానుంది. జూలై 7 నుంచి ఆషాడ బోనాలు ప్రారంభం కానుండగా.. ఈ మేరకు పలు ఆలయాల్లో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈసారి బోనాల పండుగ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. కాగా, ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లను దేవాదాయ ధర్మాదాయశాఖ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షించారు.
హైదరాబాద్ బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొండా సురేఖ మాట్లాడుతూ…. జులై 7 నుంచి 29వ తేదీ వరకు బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఈ ఏడాది కూడా లేజర్ షోలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత్ రావు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.
బోనాల షెడ్యూల్ ఇదే…
ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం(జూలై 7)వ తేదీన హైదరాబాద్ నగరంలో బోనాల పండగ ప్రారంభమవుతుంది. మొదటగా గోల్కొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలిపూజ నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. తిరిగి గోల్కొండ కోటలోనే చివరి రోజు పూజ నిర్వహిస్తారు. ఈ క్రతువుతో భాగ్యనగర బోనాల ఉత్సవాలు ముగుస్తాయి.