Saturday, November 16, 2024

ఢిల్లీలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 107వ జయంతి ఉత్సవాలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ సహా తెలంగాణ భవన్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగానే కాదు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మకు అండగా నిలిచిన న్యాయవాదిగా, మూడు తరాల తెలంగాణ ఉద్యమకారుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు.

మహాత్మా గాంధీ స్పూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం పాల్గొన్నారని, ముల్కీ ఉద్య‌మంలో పాల్గొని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన గొప్ప ఉద్యమకారుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన గొప్ప నేత అన్నారు. ప్రజాసేవకుడిగా అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారని, శాసనసభ్యులుగా, మంత్రిగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా భావించి తన సర్వస్వం ధారపోశారని అన్నారు. తన జీవితకాలం ప్రజల కోసమే పరితపించిన బాపూజీ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్య‌మంలో ఆయన సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement