న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గురువారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. నేతలిద్దరూ కేసీ వేణుగోపాల్‌తో సుమారు 40 నిమిషాల పాటు మంతనాలు సాగించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై ఆ పార్టీ అధిష్టానం ఢిల్లీలో కసరత్తు చేస్తున్న సమయంలో నేతలిద్దరూ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. కేసీ వేణుగోపాల్‌ను కలిసిన సమయంలో తాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు (కేసీఆర్) పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి పోటీ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పినట్టు సమాచారం. కేసీ వేణుగోపాల్‌తో పాటు మరికొందరు పార్టీ పెద్దలను ఈ నేతలిద్దరూ కలిసినట్టు తెలిసింది. అయితే శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీకి తిరిగొచ్చిన తర్వాత ఆయన సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికపై రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. గురువారం ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే రాజగోపాల్ రెడ్డి సహా పార్టీ వీడి వెళ్లిన నేతలందరినీ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వంపై పోరాటం చేస్తుందన్న ఉద్దేశంతో పలువురు నేతలు బీజేపీలో చేరారనని, అక్కడ చేరిన తర్వాత వారికి అసలు నిజం తెలిసొచ్చిందని ఆయన చెప్పారు.
బీఆర్ఎస్‌పై పోరాటం చేయకపోగా.. ఆ ప్రభుత్వ అవినీతిలో బీజేపీ కూడా భాగమైందని విమర్శించారు. ఇది తెలుసుకుని రాజగోపాల్ రెడ్డి సహా మరికొందరు నేతలు తిరిగొస్తున్నారని, వారికి తాను స్వాగతం పలుకుతున్నానని అన్నారు. అయితే బీజేపీకి రాజీనామా సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీపై పెద్దగా విమర్శలు చేయలేదు. పరిస్థితులను తాను కండువాలు మార్చాల్సి వస్తోందని, ఇప్పుడున్న స్థితిలో బీజేపీ బలంగా లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఆయన మునుగోడు లేదంటే ఎల్బీనగర్ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది.