తెలంగాణలో ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక హీట్ నడుస్తోంది. మాజీ మంత్రి ఈటెల రాజీనామాతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉపఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పలు పథకాలను ప్రవేశపెడుతోంది. కోట్ల వ్యయంతో కూడిన దళితబంధును అధికార పార్టీ ప్రకటించిందంటే.. ఆ ఉప ఎన్నిక ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశ పడుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని పోస్టులు పెడుతున్నారు.
కాగా భువనగిరి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తే తాము కూడా రాజీనామా చేస్తానని, అంతేగాకుండా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేత కూడా రాజీనామా చేయిస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్‌ను జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి స్వీకరించాలని వారు కోరారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య రాజకీయ వైరం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఆ దూరం ఎక్కువైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొనగా.. మంత్రి జగదీష్ మైక్‌ను రాజగోపాల్‌రెడ్డి కోపంగా లాక్కున్నారు. దాంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ మొదలైంది. ప్రస్తుతం వారి మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతుందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఈ వార్త కూడా చదవండి: హుజురాబాద్‌కు రూ.500 కోట్లు.. దళిత బంధు నిధులు విడుదల