న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్టీ వ్యతిరేక కార్యాకలాపాల ఆరోపణలపై షోకాజ్ నోటీసు అందుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం రాత్రి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యకార్యదర్శి తారిఖ్ అన్వర్‌ను కలిసినట్టు తెలిసింది. షోకాజ్ నోటీసుకు నేరుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. మునుగోడు ఉప-ఎన్నికల ప్రచార సమయంలో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ రాష్ట్ర నాయకత్వం చేసిన ఫిర్యాదుల మేరకు ఏఐసీసీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులకు బదులిచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన నేరుగా కమిటీ సభ్యకార్యదర్శిని కలవడం చర్చనీయాంశమైంది.
ఈ మధ్య ఏఐసీసీ ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు కల్పించలేదు. టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలోనూ చోటు కల్పించలేదు. ఈ సందర్భంగా టీపీసీసీ నాయకత్వాన్ని కోమటిరెడ్డి గురించి ప్రశ్నించినపుడు.. ఆయన వ్యవహారాన్ని ఏఐసీసీ నాయకత్వమే చూసుకుంటుందని బదులిచ్చారు. మొదటి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్న వెంకటరెడ్డి టీపీసీసీ కార్యవర్గ కూర్పు అనంతరం ఏఐసీసీ నాయకత్వాన్ని కలవడం టీపీసీసీలో చర్చనీయాంశంగా మారింది. షోకాజ్ నోటీసు పెండింగులో ఉన్నందునే ఆయనకు రాష్ట్ర నాయకత్వంలో బాధ్యతలు అప్పగించలేదన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన నేరుగా ఏఐసీసీ నాయకత్వంతోనే మంతనాలు సాగిస్తున్నారు.