Saturday, November 23, 2024

తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హార‌ల చీఫ్‌ థాకరేతో కోమటిరెడ్డి భేటీ.. అభ్యర్థులను ముందే ప్రకటించాలని సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 70 శాతం అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానానికి సూచించారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ థాకరేను ఆయన కలిశారు. అభ్యర్థులను చివరి నిమిషంలో ప్రకటించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని తెలిపారు. కనీసం 70 శాతం నియోజకవర్గాల్లోనైనా ముందుగా ప్రకటిస్తే వారు ప్రచారంలో ముందంజలో ఉండగలరని వెల్లడించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ముందు ప్రత్యర్థులుగా ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లు అధికారంలో ఉన్నాయని, వాటితో పోటీపడేలా వ్యూహరచన చేయాలని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పరిస్థితి గురించి వివరించినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రల గురించి కూడా తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. ప్రచార కార్యక్రమాలతో పాటు పార్టీ పురోగతి, బలోపేతం గురించి తాను కొన్ని సూచనలు చేశానని, థాకరే సానుకూలంగా వాటిని స్వీకరించారని వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ‌ను అధికారంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలన్న అంశంపై తమ మధ్య 45 నిమిషాల పాటు చర్చ జరిగిందని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement