మచిలీపట్నం, ఫిబ్రవరి 6( ప్రభ న్యూస్): వైసీపీ ఆఫీసుకు ప్రభుత్వ భూమిని కేటాయిండాన్ని నిరసిస్తూ టీడీపీ చేసిన ఆందోళన గందరగోళానికి దారితీసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను సోమవారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కాగా, రవీంద్ర రిమాండ్ ని న్యాయమూర్తి తిరస్కరించారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను మచిలీపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ప్రదర్శనలో రవీంద్ర కూడా పాల్గొన్నారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ కార్యాలయానికి ఎలా కేటాయిస్తారని ఆందోళన చేపట్టారు. ఆ ప్రభుత్వ భూమిని కొల్లు రవీంద్ర మీడియా ప్రతినిధులకు చూపించేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో, పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ మంత్రి అరెస్ట్ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. కొల్లు రవీంద్రను అక్కడి నుంచి తరలించడాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మచిలీపట్నం లక్ష్మీటాకీస్ సెంటర్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. కొల్లు రవీంద్రను బలవంతంగా అక్కడి నుంచి తరలించడంతో, పరిస్థితి సద్దుమణిగింది.