Tuesday, November 26, 2024

తుస్సుమన్న బీజేపీ ప్రకటన

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన ఓ ప్రకటన తుస్సుమంది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌, ఆత్మనిర్భర్‌ బెంగాల్‌’ శీర్షికతో ఉన్న ఈ ప్రకటనలో ప్రధాని మోదీ ఫోటోతోపాటు పథకం లబ్ధి పొందిన ఒక మహిళ ఫోటో ఉంది. ఈ కేంద్ర పథకం వల్ల తల దాచుకునేందుకు ఒక ఇల్లు తనకు సమకూరినట్లు ఆ ప్రకటనలో ఆ మహిళ పేర్కొనట్లు బీజేపీ ప్రచారం చేసింది.

కాగా ఈ ప్రకటనలో ఉన్న మహిళ కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో నివసిస్తున్న లక్ష్మీదేవిగా జాతీయ మీడియా గుర్తించింది. ఓ టీవీ జర్నలిస్ట్‌ అక్కడకు వెళ్లి ఆమెతో మాట్లాడగా షాకింగ్‌ విషయాన్ని చెప్పింది. ప్రకటనలో బీజేపీ వాళ్లు పేర్కొన్న విషయం వాస్తవం కాదని తెలిపింది. ఆ ప్రకటనలో ఉన్న ఫొటో తనదేనని, కానీ ఎవరు ప్రచురించారో తనకు తెలియని చెప్పింది. తాను కేంద్ర పథకం ద్వారా ఎలాంటి ఇంటిని పొందలేదని లక్ష్మీదేవి తెలిపింది. ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి నెలకు రూ.500 చెల్లించి చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నట్లు సదరు టీవీ ప్రతినిధికి చెప్పింది. తమ పిల్లలు ఇంట్లో పడుకుంటే తాము రాత్రి వేళ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తామని వెల్లడించింది. తమ ఇంటికి మరుగుదొడ్డి అయినా లేదని ఆమె పేర్కొంది. మరోవైపు ఈ ప్రకటనపై బెంగాల్‌లోని స్థానిక బీజేపీ నేతలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పందించేందుకు వారు నిరాకరించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement