కోల్‌కతా: ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయకుడు కేకే (కృష్ణకుమార్ కున్నథ్) మరణం అసహజమరణంగా కోల్‌కతా పోలీసులు తేల్చారు. ఆ మేరకు కేసు నమోదు చేశారు. కోల్‌కతాలో కచేరీ నిర్వహించిన కొద్ది గంటలలోనే కేకే చనిపోయారు. కచేరీ చేస్తుండగానే అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. దీంతో న్యూమార్కెట్ పోలీసు స్టేషన్‌లో ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆయనది అసహజమైన మరణంగానే పరిగణిస్తున్నాం.. ఆ దిశగానే దర్యాప్తు సాగుతున్నది… కేకే బస చేసిన హోటల్ సీసీ ఫూటేజీలు పరిశీలిస్తున్నాం.. ఆసుపత్రికి వెళ్లే లోగా ఏంజరిగిందన్నది పరిశోధిస్తున్నాం అని పోలీసు అధికారులు తెలియజేశారు. కచేరీ వేదిక నుంచి హడావుడిగా కేకేను తరలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియీలో చక్కెర్లు కొడుతున్నది. అక్కడి నుంచి ఆయన తను బస చేసిన ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఛాతీలో నొప్పి వస్తున్నదని చెప్పినట్లు, నొప్పి ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
కాగా ఆయన భౌతిక కాయాన్ని కొద్ది సేపు రవీంద్ర భవన్‌లో ఉంచారు. అక్కడ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్ర పోలీసులు గన్ సెల్యూట్ చేశారు. కేకే మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కంఠంలో అనేక భావోద్వేగాలు జాలువారేవని మోడీ తెలియజేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కేకే మరణం పట్ల సంతాపం ప్రకటించారు. విరాట్ కోహ్లి, వివిఎస్ లక్ష్మణ్ తదితర క్రికెట్ దిగ్గజాలు కూడా కేకే మరణానికి సంతాపం ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..