Friday, September 20, 2024

Kolkata | గణేష్ ఉత్సవ్ కమిటీ కీల‌క నిర్ణ‌యం…

కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో కోల్‌కతా గణేష్ ఉత్సవ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక ఉత్సవాలను హంగులు, ఆర్భాటాలకు దూరంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించేందుకు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి కోల్ కతాలో ప్రత్యేకంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

భారీ లైట్లు, అలంకరణలకు దూరంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని కోల్ కతా గణేష్ పూజ కమిటీలు నిర్ణయించాయి. అఘాయిత్యాలపై పోరు అనే థీమ్ తో ఈసారి గణేశ పూజను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గణేష్‌ పండల్‌కు వెళ్లే దారిలో కొద్దిపాటి లైటింగ్‌ ఉంటుందని పూజా కమిటీ అధ్యక్షుడు అనింద్యా ఛటర్జీ తెలిపారు.

ఇలాంటి అత్యాచార ఘటనలను ఇప్పటికైనా ఆపకపోతే మన సహచరులు చాలా మంది కూడా వీటి బారిన పడే అవకాశం ఉందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై అర్చకులు కూడా నిరసన తెలుపుతారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement