ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ల ఆమరణ నిరాహర దీక్షకు మద్దతుగా ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా సమర్పించారు.
దారుణహత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కు న్యాయం చేయాలని, ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వీరి నిరసనలకు వైద్యుల నుంచి మద్దతు పెరుగుతున్నది.
ఈ క్రమంలో ఆర్టీ కర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. వీరి నిర్ణయాన్ని అక్కడున్న విద్యార్ధులు చప్పట్లు కొట్టి స్వాగతించారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వానికి 24 గంటల నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ జూనియర్ వైద్యుల ఫ్రంట్ తెలిపింది.
ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సీనియర్ డాక్టర్లు రాజీనామా చేసినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు కేంద్రీకృత రెఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, పడకల ఖాళీల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
పని ప్రదేశాల్లో సీసీటీవీ ఆన్‌కాల్ రూమ్‌లు, వాష్‌రూమ్‌ల కోసం అవసరమైన నిబంధనల నిర్ధారణకు టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచడం, పర్మినెంట్‌గా మహిళా పోలీసు సిబ్బందిని నియమించడం, ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయడం వంటి డిమాండ్ పరిష్కారానికి జూనియర్ వైద్యులు దీక్షలు చేపట్టారు.
ఆగస్టు 9న వెలుగుచూసిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనకు నిరసనగా జూనియర్ డాక్టర్లు దాదాపు నెల రోజులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. వీరి డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఆందొళనా శిబిరం వద్దకు వచ్చి హామీ ఇవ్వడంతో జూడాలు తమ ఆందోళనను విరమించి విధుల్లో చేరారు.
అయితే, ఇచ్చిన హామీ మేరకు మమతా ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోసారి ఆందోళనకు దిగాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు.