Friday, November 22, 2024

ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి నిష్క్రమణ

ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణించిన టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లి పొట్టి క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పనున్నాడా? మరో రెండు నెలల్లో జరుగబోయే టి 20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి.. ఈ ఫార్మట్‌లో ఆడటం కష్టమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. 33 ఏళ్ల కోహ్లి ఇప్పటికే ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న తరుణంలో ఈ నిర్ణయం అతడి అభిమానులకు మరింత బాధ కలిగించేదే . అయినా బిసిసిఐ వర్గాల్లో మాత్రం హాట్‌ టాపిక్‌ . కొంతకాలంగా మునుపటి ఆట ఆడలేక తీవ్ర విమర్శల పాలవుతున్న విరాట్‌ కోహ్లిని టి 20 నుంచి శాశ్వతంగా పంపించేందుకు బిసిసిఐ సెలక్షన్‌ కమిటీ రోడ్‌మ్యాప్‌ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తున్నది.అయితే అది కోహ్లీతో చర్చించాకే..ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ఉన్న టీ 20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో అతను కొనసాగుతాడా? లేదా? అనేది తేలనుంది. ఈ మేరకు జాతీయ సెలక్షన్‌ కమిటీ కూడా కోహ్లీతో మాట్లాడేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టు బిసిసిఐ వర్గాల సమాచారం.

మూడేండ్లుగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయలేదు. అదీగాక సుదీర్ఘ ఫార్మట్‌ అయిన టెస్టు క్రాకెట్‌తోపాటు పొట్టి ఫార్మట్‌లోనూ కోహ్లి ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే కోహ్లి గత కొంతకాలంగా స్ట్రెక్‌ రొటేట్‌ చేయడానికి తప్ప దన మార్కును చూపించిన ఇన్నింగ్స్‌ ఆడిన సందర్భాలు చాలా తక్కువ. అసలు లేవని చెప్పినా అతిశయోక్తి కాదు. కోహ్లి నుంచి అభిమానులు 20,30లను కోరుకోవడం లేదు. అది అతడి స్థాయిని తగ్గించడమే. అదీగాక స్ట్రెక్‌ రేట్‌ కూడా నానాటికి దారుణంగా పడిపోతుంది.. కీలక సందర్భాల్లో చెత్త షాట్లు ఆడి వికెట్‌ సమర్పించుకోవడం కోహ్లీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. టి 20 క్రికెట్‌ పరిధి పెరగడంతో ఎక్కువ మ్యాచ్‌లు ఈ ఫార్మట్‌లోనే ఆడాల్సి వస్తుంది. అయితే కోహ్లి ఆటతీరు మాత్రం టీ 20లకు సరిపోయేట్టు లేదనేది సెలక్టర్లతో పాటు విమర్శకుల నుంచి వినిపిస్తున్న వాదన.

అయితే ఇప్పటికిప్పుడు కోహ్లిని తప్పిస్తే అది అతడితో పాటు జట్టుకూ చాలా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. జట్టుకూర్పు కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకే సెలక్టర్లు కూడా పొట్టి ప్రపంచ కప్‌ వరకు వేచిచూస్తున్నారు. అది ముగిశాక కోహ్లీతో సమావేశమై.. ఈ ఫార్మట్‌లో అతడిని ఆడించాలా..? లేదా అనే విషయమై అతడితో చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమాచారం కోహ్లికి తెలియంది కాదు. మరి కోహ్లి ఇకనైనా చెలరేగి అన్ని ఫార్మట్లలో ఆడతాడా? లేక ఏదో ఒక్క ఫార్మట్‌కే పరిమితమవుతాడా? అనేది కాలం నిర్ణయించనున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement