న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏది? పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? విశాఖ ఉక్కుకు దిక్కెవరు? అని ఆంధ్రప్రదేశ్ జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ప్రశ్నించారు. మంగళవారం ఆయన వివిధ ప్రశ్నలతో కూడిన పోస్టర్ పట్టుకుని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. తన మూడు ప్రశ్నలకు జవాబు చెప్పి లక్ రూపాయలు గెలుచుకోండి అంటూ ప్రకటించారు. రాష్ట్ర రాజధాని ఏదో తెలియక, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాక, ప్రైవేటీకరణ నుంచి విశాఖ ఉక్కును కాపాడే దిక్కు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని కోల్పోయిందని వాసు విమర్శించారు.
మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేసినందుకు, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని వైసీపీకి వరంగా మార్చుకున్నందుకు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో అటు కార్మికులు ఇటు కేంద్ర ప్రభుత్వానికి శత్రువు కాకుండా తూతూమంత్రంగా స్పందించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ అస్తిత్వాన్ని కాపాడటం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావంతులు,మేధావులు ఉద్యమించాలని జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తోందన్నారు.