హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇక మీదట మోకాలిచిప్ప మార్పిడి ఆపరేషన్లు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా ఆర్థోపెడిక్ క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడిన వారిని గ్రామాల వారీగా గుర్తించి ఆశా కార్యకర్తల సాయంతో ప్రత్యేక క్యాంపులకు తరలించాలని మంత్రి హరీష్‌రావు రాష్ట్ర వైద్య విద్య విభాగం అధిపతి డా. రమేష్‌రెడ్డిని ఇటీవలే ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకాలిచిప్ప మార్పిడికి అవసరమైన వైద్య నిపుణులు, సదుపాయాలు ఉన్నాయని, అయినా ప్రజలు ప్రయివేటుకు వెళుతున్నారని మంత్రి అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోనే ఆర్థోపెడిక్ హెల్త్ క్యాంపులు నిర్వహించి పేషెంట్లను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు పరిసర జిల్లాల్లో ప్రత్యేక ఆర్థోపెడిక్ హెల్త్ క్యాంపులు నిర్వహించాలని గాంధీ ఆస్పత్రి వైద్యులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో రోజూ 20 దాకా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. పేద, సామాన్యులు ప్రయివేటులో మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే కనీసం తక్కువలో తక్కువ రూ.2 లక్షల దాకా ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి. మోకాలి చిప్ప మార్పిడికి రూ.5 లక్షల దాకా మెజారిటీ కేసుల్లో ప్రయివేటు ఆస్పత్రులు ఛార్జ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన మంత్రి హరీష్‌రావు… ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు ఉన్నా జనం ప్రయివేటుకు వెళ్లడంపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలను పెంచాలని వైద్యులను ఆదేశించారు.
సాధారణంగా 60ఏళ్లు పైబడిన వృద్ధుల్లో మోకాళ్ల నొప్పులు సహజంగానే వస్తుంటాయి. మోకాలి చిప్పలో ఉండే కీళ్లు అరిగిపోతే వారికి మోకాలిచిప్ప మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది పేషెంట్లు జిల్లాల్లో లేదంటే హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా మోకాలిచిప్ప మార్పిడి శస్త్ర చికిత్స చేసినందుకు ఒక్కో పేషెంట్ నుంచి ప్రయివేటు/కార్పోరేటు ఆస్పత్రుల్లో లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఇది పేద, సామాన్య రోగులకు మోయలేని భారంగా పరిణమించింది.
కొద్ది రోజుల క్రితం సిద్ధిపేట జిల్లాలోని రాఘవపూర్ గ్రామంలో మొదటిసారిగా ప్రత్యేక ఆర్థోపెడిక్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 456 మందికి చికిత్సలు నిర్వహించగా 58 మందికి మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు. ఇందులో ముగ్గురికి ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ఆపరేషన్లు పూర్తి చేశారు. సిద్ధిపేటలో ఆర్థోపెడిక హెల్త్ క్యాంపుకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో త్వరలో వరంగల్ జిల్లాలో, ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..