Friday, November 22, 2024

KLF Top Leader – ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్ నేత అవతార్‌ సింగ్ క‌న్నుమూత‌…

లండ‌న్ – ఖలిస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్ నేత అవతార్‌ సింగ్‌ ఖండా యూకేలోని ఓ ఆస్పత్రిలో గురువారం మరణించాడు. . తీవ్ర అస్వస్థతతో బర్మింగ్‌హామ్‌లోని ఓ వైద్యశాలలో సోమవారం చేరారు. పరిస్థితి విషమించడంతో నేడు మృతిచెందాడు. అతడి మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు. కొన్ని వార్తా సంస్థలు విషప్రయోగం అని చెబుతుండగా మరికొన్నింటిలో బ్లడ్‌ క్యాన్సర్‌గా పేర్కొంటున్నారు.

గతంలో అవతార్‌ సింగ్‌ అమృత్‌సర్‌ శిరోమణి అకాలీదళ్‌తో సన్నిహిత సంబంధాలు నెరిపాడు. వారిస్‌ పంజాబ్‌ దే అధినేత అమృత్‌పాల్‌ సింగ్‌కు పరారీ సమయంలో ఇతడే సాయం చేశాడు. ఇటీవల వారిస్‌ పంజాబ్‌ దే కల్లోలం వెనుక అవతార్‌ సింగ్‌ హస్తం ఉందని భారత దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అమృత్‌పాల్‌ సింగ్‌ వేగంగా ఎదగడంలో ఇతడి కృషి ఉందని దర్యాప్తులో గుర్తించాయి.

మరోవైపు యూకేలో భారత హైకమిషన్‌ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని అవమానించిన ఘటనలో లండన్‌ పోలీసులు అవతార్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. దీంతోపాటు మార్చి 19న భారత హైకమిషన్‌ కార్యాలయ విధ్వంసానికి కుట్రపన్నిన వారిలో అవతార్‌ పాత్రపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. భారత్‌లో వారిస్‌ పంజాబ్‌ దే సంస్థపై పోలీసుల దాడులు మొదలైన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకొంది. అంతేకాదు ఇంగ్లాండ్‌లో ప్రార్థనా మందిరాల్లో ఇతడు బాంబుల తయారీపై శిక్షణ ఇస్తాడనే ఆరోపణలున్నాయి. అవతార్‌ సింగ్ తండ్రి కుల్వంత్‌ సింగ్‌ కుఖ్రానా ఖలిస్థాన్‌ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాది. అవతార్‌ ప్రస్తుతం కేఎల్‌ఎఫ్‌ లండన్‌ విభాగం హెడ్‌గా వ్యహరిస్తున్నాడు. తాజాగా అత‌డి మ‌ర‌ణంతో ఖ‌లిస్థాన్ లిబ‌రేషన్ ఫోర్స్ కార్య‌క‌లాపాలు నిలిచిపోతాయ‌ని అంటున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement