భారత క్రికెట్ జట్టులోని బ్యాట్స్‌మెన్ KL రాహుల్ రీసెంట్ గా జరిగిన ఐపిఎల్ (2023) లీగ్ మధ్యలో గాయపడి టోర్నమెంట్ నుండి వైదొలిగిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్ మే 1న లక్నో- ఆర్‌సిబి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డారు. ఆ తర్వాత అతను తన శస్త్రచికిత్స చేయించుకునేందుకు లండన్ వెళ్ళవలసి వచ్చింది. కాగా, ప్రస్తుతం అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో తన పునరావాసాన్ని పూర్తి చేస్తున్నాడు. అయితే, టీమిండియా జట్టులోకి రీఎంట్రీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందులో భాగంగానే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు కేఎల్ రాహుల్. దీనికి సంబంధించిన వీడియోను కూడా రాహుల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ వీడియోలో, అతను నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఈ సమయంలో, రాహుల్ చాలా మంచి రిథమ్‌లో ఉన్నట్టు కనిపించాడు. కొన్ని డేంజరస్ షాట్‌లు సైతం ఆడాడు. దీని తర్వాత, జిమ్‌లో వర్కౌట్ చేస్తూ.. చెమటలు కక్కుతూ కనిపించాడు.
అయితే రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం భారత జట్టుకు శుభవార్త అనే చెప్పాలి. ఎన్ సీఏ నుండి ఫిట్ నెస్ అప్రూవల్ వచ్చిన తరువాత వచ్చే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ముఖ్యమైన పాత్ర పోషించే చాన్స్ ఉంటుంది. టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కారణంగా గాయపడిన తర్వాత, వికెట్ కీపర్ బ్యాటింగ్‌గా రాహుల్ టీమ్ మేనేజ్‌మెంట్ మొదటి ఎంపికగా మారాడు.