న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా ఏకమై దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసి, అనంతరం సీఆర్పీఎఫ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిష్పాక్షికంగా దేశంలో సమగ్రాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా.. భారతదేశానికి దక్కుతున్న గౌరవమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా మరోసారి దేశాభివృద్ధికి పునరంకితం అవుదామంటూ దేశ ప్రజలను కోరారు. మరోవైపు పద్మ అవార్డులు పొందిన వారందరికీ అభినందనలు తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దేశంలోని రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ‘పద్మ విభూషణ్’ అవార్డుకు ఎంపికవడం పట్ల హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా అభివర్ణించారు. తెలుగు బిడ్డలకు పద్మవిభూషణ్ లభించడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.