Friday, November 22, 2024

హైదరాబాద్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.. అతిథిగా హాజరు కావాలంటూ కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఆహ్వానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాల్లో అతిథిగా పాల్గొనాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ గడ్డపై స్వాతంత్ర్య వజ్రోత్సవాలను (75 ఏళ్ల సంబరాలు) ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. గౌరవ అతిథులుగా హాజరు కావాలని కోరుతూ కేసీఆర్‌తో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైలకు కూడా కిషన్ రెడ్డి లేఖలు రాశారు. 2023 సెప్టెంబర్ 17 వరకు నిజాం పాలిత ప్రాంతాల్లోని నాటి అరాచక పాలనపై పోరాటం చేస్తూ మాన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో ఆయన కోరారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, తెలంగాణ విమోచనంలో మన పెద్దలు చేసిన త్యాగాలు, వారి శౌర్య, పరాక్రమాలను ప్రస్తుత తరానికి తెలపడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంలో నాటికి అస్తిత్వంలో ఉన్న 562 సంస్థానాలు భారత ప్రభుత్వంలో కలిసేందుకు అంగీకారం తెలుపగా, ఒక్క హైదరాబాద్ మాత్రమే ఆ ప్రతిపాదనను ప్రతిఘటించిందని ఆయన గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఏడాది తర్వాత అంటే సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లోని కొన్ని ప్రాంతాలకు నిజాం అరాచక పాలన నుంచి స్వాతంత్ర్యం లభించగా… ‘ఆపరేషన్ పోలో’ పేరుతో నాటి కేంద్ర హోంమత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సమయానుగుణంగా తీసుకున్న చర్యలవల్లే ఆయా ప్రాంతాలకు విమోచనం లభించిందని కిషన్ రెడ్డి నాటి పరిస్థితులను వివరించారు. చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించిందని కేసీఆర్‌కు పంపిన ఆహ్వానంలో కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17ను మహారాష్ట్ర ప్రభుత్వం ‘మరాఠ్వాడా ముక్తి సంగ్రామ్ దివస్’గా, కర్ణాటక ప్రభుత్వం ‘హైదరాబాద్-కర్ణాటక విమోచన దినోత్సవం’గా జరుపుకుంటున్నాయని, మూడు రాష్ట్రాల్లోని నిజాం పాలిత ప్రాంతాల్లో మన పెద్దలు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర్య భారతానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకునే అవకాశం మనకు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ పోరాట యోధులను స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించవలసినదిగా ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో కేంద్రం చేపట్టాల్సిన కార్యక్రమాలపై అమూల్యమైన సలహాలు సూచనలు అందిచవలసినదిగా కిషన్‌రెడ్డి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement