Tuesday, November 26, 2024

ఏప్రిల్ 20, 21 తేదీల్లో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్.. నిర్వహణ ఏర్పాట్లను వివరించిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న దేశాలతో సాంస్కృతిక, దౌత్య సంబంధాల బలోపేతం కోసం ‘గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ – 2023’ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. బౌద్ధమతం భారతదేశంలో పుట్టి వివిధ దేశాలను విస్తరించిందని.. అలాంటి దేశాలతో మనకున్న సాంస్కృతిక సారూప్యతను కాపాడుకుంటూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ఆయన అన్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ – 2023 జరగనున్న నేపథ్యంలో సోమవారం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్‌’లో ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన విషయాలను కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం బౌద్ధమతానికి సంబంధించి తొలిసారి ఇంత పెద్ద ఉత్సవం నిర్వహిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బౌద్ధమతం చూపించే మార్గం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులో 30 దేశాలనుంచి బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతాన్ని ఆచరించే ప్రముఖులు, వివిధ దేశాల దౌత్యవేత్తలు, అంబాసిడర్లు తదితరులు పాల్గొంటారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బౌద్ధమతానికి సంబంధించిన పవిత్ర క్షేత్రాల్లో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేయడంతోపాటు.. ఆయా ప్రాంతాలకు అనుసంధానతను పెంచుతోందన్నారు. బుద్ధుడి మహాపరినిర్వాణం జరిగిన కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గతేడాది మోదీ ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. దీంతోపాటుగా బౌద్ధమతానికి సంబంధించి.. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ డీమ్డ్ యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు తదితర కేంద్రాల ద్వారా పాలీతోపాటు వివిధ భాషల్లో ఉన్న బౌద్ధ మత గ్రంథాలను డిజిటైజేషన్ చేస్తున్నామన్నారు. దీనికితోడు బుద్ధుడు జన్మించిన ప్రాంతమైన నేపాల్ లోని లుంబినిలో అత్యాధునిక వసతుల కల్పన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారన్నారు. ఈ సదస్సును నిర్వహించేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కరోనా కారణంగా ఆలస్యమైందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement