హైదరాబాద్ – ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై ఎప్పుడు దర్యాప్తు చేయిస్తారని రేవంత్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిలదీశారు.. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ , రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ స్టేట్కు సంబంధించిన వ్యవహారాలపై దర్యాప్తు చేయకుండా బీఆర్ఎస్ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఆ చట్టాన్ని తీసివేసి కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేస్తుందా..? లేక బీఆర్ఎస్ను కాపాడుతుందా అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్ అని విమర్శలు గుప్పించారు. మరీ కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ, బొరుసు అని ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండా సైలెంట్ అవుతుందా అని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దోషులకు శిక్ష పడాలని ఉందా.. లేదా..? ఉంటే దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని నిరూపించుకోవాలని, అందుకోసం అయినా సీబీఐ దర్యాప్తు కోరాలని సూచించారు. రేవంత్ సర్కార్ సీబీఐ విచారణ కోరిన 48 గంటల్లోనే దర్యా్ప్తు మొదలు అయ్యేలా చేస్తామని అన్నారు.