Thursday, November 21, 2024

Delhi | కేంద్ర పెద్దలతో కిరణ్‌కుమార్ రెడ్డి మంతనాలు.. ఢిల్లీలో వరుస భేటీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీలో చేరిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దూకుడు పెంచారు. సుదీర్ఘ రాజకీయ విరామం తర్వాత కాషాయ తీర్థం పుచ్చుకుని రాజకీయం మొదలుపెట్టారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్‌కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కేంద్ర పెద్దలతో వరుసగా సమావేశమయ్యారు. పార్టీ ముఖ్యనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ సంఘటన్ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్ సంతోష్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో వేర్వేరుగా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలతో పాటు కర్ణాటక ఎన్నికల మీద వీరు సమగ్రంగా చర్చించారు.

తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కర్ణాటకలో వారిని ఆకర్షించడానికి తెలుగు నేతలతో ప్రచారం చేయించాలని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం, రాయలసీమకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చెందిన కీలక నేత కావడంతో కిరణ్ కుమార్ రెడ్డి కర్ణాటకలో ప్రచారం చేస్తే తమకు మైలేజీ వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. తమ లెక్కల ప్రకారం కిరణ్‌కుమార్ కర్ణాటక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారని పార్టీ జాతీయ నాయకత్వం అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

సోము వీర్రాజుతో మర్యాదపూర్వక భేటీ..

సాయంత్రం 7 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. నేరుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న తాజ్ మాన్‌సింగ్ హోటల్‌కు వెళ్లారు. ఆయనతో పాటు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డితో సోము వీర్రాజు బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజును కిరణ్‌కుమార్ శాలువా కప్పి సన్మానించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కర్ణాటక రాజకీయాలపై వారు చర్చించారు.

కిరణ్‌రెడ్డికి కిషన్‌రెడ్డి విందు..

హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. సోము వీర్రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డితో ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించాక వారు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనపై వ్యాఖ్యానించిన అనంతరం కిషన్‌రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేరికపై స్పందించారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉన్నానని గుర్తు చేశారు. తమ మధ్య మంచి స్నేహం ఉందని, ఆయన ఢిల్లీలో ఉన్నారని తెలుసుకుని తన ఇంటికి ఆహ్వానించానని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే కేసీఆర్ పక్కన ఉన్నారని, అసదుద్దీన్ ఓవైసీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇందుకు ఉదాహరణలని కిషన్‌రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరిక తెలంగాణ బీజేపీపై వ్యతిరేక ప్రభావం చూపదని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితమే కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేరమని ఆహ్వానించామని తెలిపారు. ఆయన చేరిక చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన చేరిక బలం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ – జనసేనతో పొత్తుతో ముందుకెళ్తున్నాయని, వైఎస్సార్సీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని వెల్లడించారు. పొత్తు విషయంపై తమకు క్లారిటీ ఉందని, ఎప్పుడు ఏం జరగాలో అది జరుకుతుందని నొక్కి చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఆయన అభిప్రాయమని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కేసీఆర్ ఉపయోగించే భాష తాను మాట్లాడనని ఆయన వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం కూడా చాలా రైళ్లు ప్రవేశపెట్టారని అన్నారు. మీడియా సమావేశం తర్వాత కిషన్‌రెడ్డి వారికి మర్యాదపూర్వక విందు ఏర్పాటు చేశారు.  

చాలాకాలం తర్వాత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ భారీ హామీతోనే బీజేపీలో చేరినట్టు ప్రచారం సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మెరుగైన రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి కీలక పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వినియోగించుకోవాలని భావిస్తోంది.

సోము వీర్రాజు మంత్రాంగం

పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చి వెళ్లిన తర్వాత బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. సోము వీర్రాజు మూడు రోజులు ఢిల్లీలోనే ఉండి అధిష్టానం పెద్దలను కలవనున్నారు. రాష్ట్రంలోని పలు అంశాల మీద కేంద్రమంత్రులతోనూ ఆయన సమావేశమవుతారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకత్వ అంశాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ అంశాల మీదా సోము పార్టీ పెద్దలతో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన-బీజేపీ మధ్య తలెత్తుతున్న దూరం, టీడీపీతో పొత్తు వంటి అంశాలపై ఆయన అధిష్టానానికి స్పష్టత ఇవ్వనున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement