Thursday, November 21, 2024

సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ.. జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలాకాలం తర్వాత కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అవ్వడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం దాదాపు 45 నిమిషాల పాటు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పార్టీ బలోపేతంపై సుదీర్ఘ చర్చ జరిగినట్టు సమాచారం. ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీలో పెను మార్పులు చేసేందుకు అధినాయకత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి సోనియాను కలవాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన సోనియాను కలిసి పార్టీలో గతంలో మాదిరిగా చురుగ్గా పని చేయాలనుకుంటున్నట్టు తన అభిమతాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా, సీనియర్ నేతగా పాలనానుభవం ఉన్నందున ఏదైనా పెద్ద రాష్ట్రానికి ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకోవాలనే ఆలోచనలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారని సమాచారం. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షుడిగానూ కిరణ్ కుమార్ రెడ్డిని నియామించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు ఊహాగానాలు జోరుగా సాగాయి. సాధ్యమైనంత త్వరగా సంస్థాగత మార్పులు, పార్టీ పదవుల భర్తీని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వం రెండు రోజులుగా జనరల్ సెక్రటరీలు, ఇంచార్జీలతో సమావేశమై చర్చలు జరిపింది. సోనియా గాంధీతో భేటీ అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ తిరిగి వెళ్లారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement