కింగ్ కోహ్లి ఈజ్ బ్యాక్.. నిన్న (గురువారం) ఆఫ్ఘనిస్థాన్‌తో విరాట్ ఆడిన తీరు చూసిన తర్వాత ప్రతి అభిమాని ఇదే అనుకొని ఉంటాడు. సుమారు మూడేళ్లు, 83 ఇన్నింగ్స్ తర్వాత విరాట్ కోహ్లి మళ్లీ సెంచరీ కొట్టాడు. అయితే ఆ సెంచరీతోనే తనకు అలవాటైన రీతిలో ఎన్నో రికార్డులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో 61 బాల్స్‌లోనే 122 రన్స్ చేసిన విరాట్.. ఏకంగా 8 రికార్డులు సృష్టించడం విశేషం. ఆ రికార్డులేంటో ఓసారి చూద్దాం.
కోహ్లి ఒక్క సెంచరీ.. 8 రికార్డులు ఇవే..
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో విరాట్ కోహ్లికి ఇది 71వ సెంచరీ. దీంతో అతడు ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ రికీ పాంటింగ్ సరసన నిలిచాడు. అత్యధిక సెంచరీల లిస్ట్‌లో పాంటింగ్, కోహ్లి సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నారు. సచిన్ 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ 71 సెంచరీలు చేయడానికి కోహ్లి అన్ని ఫార్మాట్లు కలిపి ఆడిన ఇన్నింగ్స్ సంఖ్య 522. క్రికెట్‌లో ఇంత వేగంగా 71 సెంచరీలు చేసిన ప్లేయర్ మరొకరు లేరు. సచిన్ తన 71వ సెంచరీని 523వ ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు.
ఇక అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లికి ఇదే తొలి సెంచరీ అయినా.. మొత్తంగా టీ20 క్రికెట్‌లో ఇది ఆరో సెంచరీ. దీంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఇండియన్ బ్యాటర్లు రోహిత్, కేఎల్ రాహుల్ సరసన కోహ్లి నిలిచాడు. ఆసియాలోనూ ఇదే అత్యధికం. పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం కూడా ఆరు సెంచరీలతో వీళ్లతో సమానంగా ఉన్నాడు. ఓవరాల్‌గా చూస్తే క్రిస్ గేల్ 22 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండగా.. కోహ్లి నాలుగోస్థానంలో ఉన్నాడు.
ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మొత్తంగా విరాట్ కోహ్లి 24 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 522 ఇన్నింగ్స్‌లోనే 24 వేల రన్స్ చేసిన తొలి క్రికెటర్ కూడా కోహ్లినే. సచిన్ టెండూల్కర్‌కు 543వ ఇన్నింగ్స్‌లోగానీ ఇది సాధ్యం కాలేదు. ఇక ఇండియా తరఫున మొత్తంగా 24 వేల రన్స్ చేసిన వాళ్లలో సచిన్, కోహ్లి కాకుండా ఇప్పటికే కోచ్ ద్రవిడ్ కూడా ఉన్నాడు.
ఆఫ్ఘనిస్థాన్‌తో కోహ్లి 122 రన్స్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇండియన్ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. రోహిత్ 118 రన్స్ రికార్డును తిరగరాశాడు.
అన్ని ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన 4వ భారత బ్యాటర్ విరాట్ కోహ్లి. ఇంతకుముందు రైనా, రోహిత్, రాహుల్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇక కేవలం టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు తీసుకుంటే రోహిత్, రాహుల్, రైనా, సూర్యకుమార్, దీపక్ హుడా తర్వాత సెంచరీ చేసిన ఆరో ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్‌లోనే అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి 3500 రన్స్ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ కోహ్లినే. ఇక కేవలం 96 ఇన్నింగ్స్‌లోనే 3500 రన్స్ పూర్తి చేసి అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న బ్యాటర్‌గా నిలిచాడు.
ఇక ఆసియా కప్‌లలో కోహ్లి మొత్తం రన్స్ 1042. ఈ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన ఇండియన్ బ్యాటర్‌గా రోహిత్ రికార్డును తిరగరాశాడు. ఓవరాల్‌గా జయసూర్య, సంగక్కర తర్వాత మూడోస్థానంలో ఉన్నాడు.