క్రికెట్‌లోని అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరుగాంచిన మహేంద్ర సింగ్ ధోనీ చాలా రోజుల తర్వాత మెరుపులు మెరిపించాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో చివర్లో వచ్చి చెలరేగిన ధోనీ.. చెన్నైని చివరి ఓవర్లో గెలిపించాడు. చేసింది 18 పరుగులే అయినా.. ఆ సమయంలో ఉండే ఒత్తిడిని తట్టుకుంటూ ఒకప్పటి ధోనీని తలపించాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ తర్వాత మిస్టర్ కూల్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు. కింగ్ ఈజ్ బ్యాక్.. గేమ్‌లో గ్రేటెస్ట్ ఫినిషర్. మరోసారి నన్ను ఆనందంతో గెంతులేసేలా చేశాడు అని ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ ట్వీట్ చేశాడు.
అటు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా కూడా ధోనీని పొగుడుతూ ఓ ట్వీట్ చేసింది. ఫినిషర్ ధోనీ మరోసారి ముందుండి టీమ్‌ను నడిపించాడు. తన ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ, ఎప్పుడూ తన సహనాన్ని కోల్పోకుండా ఉన్నాడని ప్రీతి ఆ ట్వీట్‌లో ప్రశంసించింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఉతప్ప కళ్లు చెదిరే ఇన్నింగ్స్, ధోనీ ఫినిషింగ్‌తో క్వాలిఫయర్‌లో గెలిచి 9వ సారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది.