Thursday, November 21, 2024

ప్రాణం తీస్తున్న వేగం.. త‌ప్పెవ‌రిది..

ఒకప్పుడు మోటార్‌ సైకిల్‌ వాడే వారందరూ దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల వయస్సు వచ్చినవారే ఎక్కువమంది ఉండేవారు. పెద్దవారు కావడంతో నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం , జాగ్రత్తగా నడపడం చేసేవారు. దీంతో ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉండేది. అయితే ప్రస్తుతం యువత పదో తరగతి ఉత్తీర్ణులు కాగానే తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కళాశాలకు మోటార్‌ సైకిల్‌పై వెళ్లడం ప్రస్తుత యువత ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. లైసెన్స్‌ తీసుకునేందుకు 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉండగా , 16 సంవత్సరాల వయస్సులోనే వారి చేతికి వాహనాలు అందుతుండడంతో ఉడుకు రక్తం ప్రభావంతో మితిమీరిన వేగంతో రహదారులపై దూసుకువెళ్తూ వారు ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా , మరెంతో మంది ప్రాణాలు పోయేందుకు కూడా కారణమవుతున్నారు. ఇందులో తల్లిదండ్రుల తప్పే ప్రధాన కారణంగా ఉంటోంది.

వాహనాల వేగాన్ని , సామర్ధ్యాన్ని సీసీల్లో కొలుస్తారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న మోటార్‌ సైకిళ్లల్లో అత్యధికం యువతను ఆకట్టుకునేలా 150 సీసీ నుంచి 250 సీసీ వరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కొన్ని మోడళ్లు అయితే 450 సీసీని మించి కూడా ఉంటున్నాయి. కనీసం లైసెన్స్‌ లేకపోయినా , డ్రైవింగ్‌ సక్రమంగా రాకపోయినా కూడా యువత తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి స్థాయిని మించి వాహనాలను అత్యధిక వేగంతో నడుపుతూ నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోయి ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

యువత వాడుతున్న వాహనాల్లో అత్యధికం వారి తల్లిదండ్రుల పేరుతోనే ఉంటున్నాయి. కొన్నిచోట్ల యువత పేరుతో ఉంటున్నప్పటికీ వారికి కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా కంపెనీలు అమ్మకాలు చేస్తుండడం కూడా ప్రమాదాలకు ఓ కారణమే. నిబంధనలు మరింత కఠినతరం చేయాలని , అత్యధిక సామర్థ్యం కలిగిన మోటార్‌ సైకిళ్ల మోడళ్లను కూడా నిషేధించాలని డిమాండ్లు వస్తున్నాయంటే ఆయా వాహనాల వలన ఎంత ప్రమాదం ఉందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ బిడ్డలు పదో తరగతి , ఇంటర్‌ పాస్‌ కాగానే వాహనాలు అడిగినప్పుడు కొనుగోలు వాయిదా వేయడం ఉత్తమమని రవాణా, పోలీసు నిపుణులు సూచిస్తున్నారు. గారాబంతో వాహనాలు కొనిస్తే వారు ప్రమాదాలకు కారణమై మృతిచెందడమే కాకుండా చివరకు కుటుంబాలు కూడా అనాథలుగా మారిపోతున్నాయని గుర్తు చేస్తున్నారు. యువత కూడా బాధ్యతగా మెలిగి కుటుంబాలను ఆదుకోవడం ప్రధాన బాధ్యత అని తెలుసుకుని రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించడం , వ్యసనాలకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement