గుంటూరు, ప్రభన్యూస్‌బ్యూరో: గుంటూ రు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గంజాయి మత్తులో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన హత్యలుగా భావిస్తున్నారు. మత్తులో చోరీలు, అడ్డొచ్చిన వారిని హతమార్చడం, అర్దరాత్రి దుకాణాల లూటీ, గడ్డపలుగులతో హల్..చల్ సినిమాలో క్రైమ్ సీన్స్‌ను తలపి స్తున్నాయి. ఇప్పటి వరకు గంజాయి మత్తులో రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉన్నవారిని దోచుకోవడం, మహిళలు కన్పిస్తే వేధించడం వంటి కార్యకలాపాలు చోటుచేసుకునేవి. తాజాగా నగరంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డుల ను కిరాతకంగా చంపడంతోపాటు, దుకాణా ల్లో చోరీలకు ప్రయత్నించారు. గుంటూరు నగరంలోని అరండల్‌పేటలోని లిక్కర్ మార్ట్, అమరావతి రోడ్డులోని యమహాషోరూం సెక్యూరిటీ గార్డులైన వెంకటేశ్వర్లు, శ్రీరామ్ కృపానిధిని ఇనుప రాడ్డుతో పాశవికంగా హత మార్చారు. అరండంల్‌పేటలోనే స్వగృహ ఫుడ్‌లోని వాచ్‌మెన్‌పై దాడి చేయగా తీవ్ర గాయాలతో తృటిలో తప్పించుకున్నారు. ఇదే ప్రాంతంలో మీ సేవాకేంద్రం, కంప్యూటర్ దుకాణం గడ్డపారతో పగులగొట్టేందుకు ప్రయత్నించగా సమీపంలోని వారు కేకలు వేయడంతో పారిపోయారు. . నగరం నిద్రపోతున్న వేళ గస్తీ పోలీసులు ఏం చేస్తున్నారో తెలీదు కానీ దొంగలు మాత్రం వారి పని వారు దర్జాగా చేసుకొని పోతున్నారు. చిన్న చిన్న చోరీలు స్టేషన్ వరకు రావడం లేదు కానీ నగరంలో ఏదోచో రోజుకొక చోరీ వార్త చెవిన పడుతూనే ఉంది. గత నెల రోజుల వ్యవధిలో ఇన్నర్ రింగ్ రోడ్డులోనే 10 దుకాణాలను దొంగలు దోచుకున్నారంటే నిఘా ఏ స్థాయిలో ఉందో ఇట్టే స్పష్టమౌతుంది. అంతేకాకుండా నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిథిలోని రామిరెడ్డి నగర్ లో గత 20 రోజుల క్రితం వరుసగా ఐదు ఇళ్ళల్లో మంచి నీటి పైప్ మూతలను దొంగలు తీసుకెళ్ళారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి అరండల్ పేట పోలిస్ స్టేషన్ పరిథిలో ఓ విద్యార్థినికి సంబంధించిన సైకిల్ కూడా చోరీకి గురైంది. తాజాగా పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిథిలో ఐదు చోట్ల వరుస చోరీలు జరిగాయి. ఇటు-వంటి ఘటనలు నగరంలో నిత్యకృతమయ్యాయి. ఇప్పటి-కై-నా రాత్రివేళ భధ్రతా చర్యలను కట్టు-దిట్టంగా అమలు చేయాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డబ్బుకోసం హత్యలు..చోరీలు
గంజాయి, ఇతర మత్తు పదార్ధాలు యువతను నేరాలకు పురిగొల్పుతున్నాయి. డబ్బుకోసం మత్తులో హత్యలు, చోరీలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాను గంజాయి పొగ దట్టంగా కమ్మేస్తోంది. మద్యం, నాటు-సారా, గుట్కా, ఖైనీ వంటి మత్తు పానీయాలు, పదార్థాలను మించి గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఇక్కడ, అక్కడ అన్న తేడా లేకుండా ఎక్కడంటే అక్కడ గంజాయి లభ్యమవుతోంది. గతంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కనిపించే గంజాయి దందా జిల్లా కేంద్రాలైన గుంటూరు, నరసరావుపేటతో సహా జిల్లాల్లోని అన్ని పట్టణాల్లోనూ యథేచ్ఛగా సాగిపోతోంది. పల్నాడులో మాచర్ల, గుంటూరులో మంగళగిరి- తాడేపల్లి, గుంటూరులు స్థావరాలుగా జిల్లా అంతటా గంజాయిని వ్యాపింపజేస్తున్నారు. కళాశాలల్లో చదువుకుంటు-న్న విద్యార్థులు, టీ-నేజ్ యువకులను టార్గెట్ చేసి అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎక్కడో రహస్యంగా అనుకుంటే పొరపాటే. రైల్వేస్టేషన్, బస్టాండు సహా జనసమర్ధం ఎక్కువగా ఉండే ఆసుపత్రులు, కూడళ్లు, కళాశాలల పక్కనే గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. వీటికి దగ్గరలో ఏదో ఒక ఇల్లు లేదా రూము లేదా దుకాణాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమార్కులు తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. అధికారులు, పోలీసుల పర్యవేక్షణ కొరవడడంతో వారు మరింతగా చెలరేగిపోతున్నారు. ఆగి ఉన్న రైలు బోగీల్లో, గూడ్సు రైళ్ల కింద, రైల్వే ట్రాకుల పక్కన, జనసమర్ధం లేని ఖాళీ బస్ స్టాపులు, ఇళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలాలు, రైల్వే ట్రాకులు, రోడ్ల కింద ఉండే అండర్ పాస్‌లను వెతుక్కొని ఇద్దరు ముగ్గురు అక్కడ చేరి గంజాయి దమ్ము కొడుతున్నారు. సాయంత్రం అయితే ఆ వైపు వెళ్లడానికే సామాన్య జనం భయపడేంతగా అక్కడ వాతావరణం మారిపోవడంతో వాటిని శాశ్వత స్థావరాలుగా మార్చుకుంటు-న్నారు. పోలీసుల పర్యవేక్షణ, రోజువారీ తనిఖీలు లేకపోవడంతో వారికి అడ్డే లేకుండా పోతోంది. జిల్లాలోని ఏ రైల్వే స్టేషన్ వద్ద చూసినా రైల్వే కేబిన్లకు సమీపంలో లూప్‌లైన్ జంక్షన్ల వద్ద ఇలాంటి గుంపులు అనేకం కనిపిస్తున్నాయి. అర్ధరాత్రుళ్లు వీరంతా ముఠాలుగా ఏర్పడి నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
గుంటూరు, పల్నాడు జిల్లాల్ల్లో గుంటూరు జిల్లాలో 2021లో 38 గంజాయి కేసులు నమోదు కాగా, 59 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 58.29కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 52 కేజీలు మంగళగిరిలో, మిగతాది గుంటూరులోనే దొరికింది. 2022లో జిల్లాలో 20 కేసులు నమోదు 32 మందిపై కేసులు నమోదు చేసి, వారి వద్ద 38.85 కిలోల గంజాయి, ఒక గంజాయి మొక్క, ఏడు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2023లో 50 రోజుల్లో మూడు కేసులు నమోదు కాగా, ఐదుగురిని అరెస్టు చేసి 2.37 కిలోల గంజాయి దొరికింది. జిల్లాలో గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరుగుతోంది. పల్నాడు జిల్లాలో 2022లో 11 కేసులు నమోదవగా 4.9 కిలోల గంజాయి లభించింది. 7 గంజాయి మొక్కలు దొరికాయి. సెబ్ ఏర్పా-టైన 2020 మే నుంచి ఇప్పటి వరకూ 19కేసులు నమోదవగా, 73.62 కిలోల గంజాయిని సెబ్ అధికారులు పట్టు-కున్నారు. ఇందులో 90శాతం గంజాయి మాచర్ల పరిసర ప్రాంతాల్లోనే దొరకగా, గురజాల, వినుకొండ, చిలకలూరిపేట, పిడుగురాళ్లతో పాటు- జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కేసులు నమోదవడం విశేషం. ఈ ఏడాది నెలరోజుల్లో ఈపూరు, వినుకొండల్లో రెండు కేసులు నమోదయ్యాయి. అంటే ఏ స్థాయిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయో అంచనా వేయవచ్చు.