హైదరాబాద్: సరూర్‌నగర్ డివిజన్‌లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం రేపింది. అనుమతి లేకుండా ఆసుపత్రి నిర్వహణ, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయన్న సమాచారంతో మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు..సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులు ఆశ చూపి, ఇతర ప్రాంతల నుంచి డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి చికిత్సల ద్వారా డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయం బయటికి వెలుగు చూడటంతో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి చేరుకుని పోలీసుల సహకారంతో తనిఖీలు చేపట్టారు.
తమిళనాడుకు చెందిన ఇద్దరు, కర్ణాటకకు చెందిన ఇద్దరికి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా.. వాటిని కర్ణాటకకు చెందిన ఇద్దరు రోగులకు అమర్చినట్టు దర్యాప్తులో తేలింది. కిడ్నీ దాతలతో పాటు, ఇద్దరు రోగులను నాలుగు అంబులెన్స్‌లలో పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఆరు నెలల కిత్రమే అలకనంద ఆసుపత్రి ప్రారంభమైందని, ఇద్దరు వైద్యులతో చిన్న.. చిన్న శస్త్ర చికిత్సలకు మాత్రమే అనుమతి ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇటీవలే వారికి కిడ్ని మార్పిడి చికిత్స జరగడంతో రోగులు అనారోగ్యానికి గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అలకనంద ఆసుపత్రిని సీజ్ చేసినట్టు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రి ఎండీ సుమంత్ చారీ, ఆసుపత్రి సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు సరూర్‌నగర్ పోలీసులు తెలిపారు.