హైదరాబాద్ : బి ఫార్మసీ విద్యార్ధిని పోలీసులకే టోకరా ఇచ్చింది… కిడ్నాప్, అత్యాచారం జరిగిందటూ డ్రామా అడింది.. అయితే పోలీసు విచారణలో అవన్నీ అవస్తవాలని తేలింది.. సంచలనం సృష్టించిన ఘట్ కేసర్ కిడ్నాప్, అత్యాచారం కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. బీ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని, కిడ్నాప్‌కు కూడా ఎవరూ ప్రయత్నించలేదని ఆయన స్పష్టం చేశారు. 10వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:50 గంటల వరకు 4 కిలోమీటర్ల నడిచిన యువతి.. కిడ్నాప్, అత్యాచారం చేశారని నాటకామాడిందన్నారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు బీ ఫార్మసీ చదువుతున్న యువతి రాంపల్లి బస్టాండ్ వద్ద కాలేజీ బస్సు దిగింది. అక్కడ్నుంచి ఆటోలో తన సీనియర్‌తో కలిసి ఎక్కింది. ఆమె దిగాల్సిన స్టాప్ కంటే ముందే సీనియర్ దిగి వెళ్లిపోయాడు. హెరిటేజ్ స్టాప్ వద్ద దిగాల్సిన విద్యార్థి, ఆ తర్వాతి స్టాప్‌లో ఆటో దిగింది. అప్పుడు సాయంత్రం 6:30 గంటల సమయం అవుతోంది. యువతి తన తల్లికి ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. దీంతో కంగారుపడ్డ తల్లి 100కి డయల్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కీసర, ఘట్కేసర్, మల్కాజ్గిరి పోలీసులు అప్రమత్తమై యువతి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతికి పలుమార్లు ఫోన్ చేయగా చివరకు 7:45 గంటలకు ఫోన్ లిఫ్ట్ చేసింది. తాను ఉన్న లోకేషన్‌ను పోలీసులకు షేర్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యువతి కాలికి గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. బట్టలు కూడా సరిగా లేకపోవడంతో పోలీసులు ఆమెపై అత్యాచారం జరిగిందని భావించి మేడిపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ ఆ అమ్మాయి పోలీసులకు స్పందించడం లేదు. ఏం జరిగిందో చెప్పే స్థితిలో లేదు. పోలీసులు ఆ రోజు రాత్రి అమ్మాయిని విచారిస్తున్న సందర్భంగా కొన్ని విషయాలు చెప్పింది. తనను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని ఇంజెక్షన్ ఇచ్చారని, తలపై బాదారని తెలిపింది. తెల్ల కలర్ ఆటోలో ఈ ఘటన జరిగినట్లు, అది సెవెన్ సీటర్ ఆటోల అని చెప్పింది. యువతి చెప్పిన సమాచారంతో అన్నోజిగూడ ఏరియాలోని ఆటో డ్రైవర్లను సుమారు 100 మందిని విచారించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ ముగ్గురిలో ఒకరు తనను బలవంతం చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో అతన్ని పోలీసులు విచారణ చేయగా, తాను ఆ సమయంలో బార్‌కు వెళ్లానని ఆటో డ్రైవర్ చెప్పాడు. డ్రైవర్ సమాధానంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా అతను బార్‌కు వెళ్లింది నిజమేనని తేలింది. యువతి తప్పుదోవ పట్టిస్తున్నట్లు పోలీసులు గ్రహించారు. ఇక ఆ యువతి మరుసటి మరో నాటకానికి తెరలేపింది. తనపై అత్యాచారం చేశారని తెలిపింది. దీంతో యువతిని మెడికల్ ఎగ్జామినేషన్‌కు పంపగా అలాంటిదేమీ జరగలేదని తేలింది. ఇక చివరకు ఆ యువతి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఇంటి నుంచి వెళ్లిపోయేందుకే కిడ్నాప్ నాటకం, అత్యాచారం చేశారని తల్లికి ఫోన్ చేసి చెప్పానని యువతి పోలీసులకు చెప్పింది. ఆర్నేళ్ల క్రితం కూడా ఆమె ఇలాగే కిడ్నాప్ నాటకామాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యులతో గొడవల కారణంగానే యువతి ఈ ప్రణాళిక చేసినట్లు పోలీసులు వివరించారు.
పోలీసులకే టోకరా – బి ఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్, అత్యాచారం డ్రామా..
Advertisement
తాజా వార్తలు
Advertisement