మాజీ ప్రపంచ నెంబర్ వన్ ప్తేయర్ కిదాంబి శ్రీకాంత్ జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. మంగళవారం నుంచి ఆ టోర్నీ క్వాలి ఫయింగ్ మ్యాచ్‌లు ప్రారంభం కావాల్సి ఉంది. శ్రీకాంత్ టోర్నీకి దూరం కాగా, గత ఏడాది ఆ టోర్నీలో ఫైనలిస్ట్‌గా నిలిచిన లక్ష్య సేన్ ఈ సారి తన ప్రతాపాన్ని చూపనున్నాడు. సేన్‌తో పాటు కొత్త చాంపియన్ మిథున్ మంజూనాథ్ కూడా జర్మన్ ఓపెన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఇద్దరూ టాప్ ఇండియన్ ప్లేయర్లుగా పోటీచేయనున్నారు.
కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన సేన్. గత టోర్నీ సెమీస్‌లో ప్రపంచనెంబర్ వన్ విక్టర్ అక్సెల్ సన్‌ను ఓడించిన విషయం తెలిసిందే. అల్మోరాకు చెందిన 21వ సీడ్ సేన్ ఈసారి ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఓపెనింగ్ రౌండ్‌లో అతను ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపోవ్‌తో తలపడుతాడు. ఇక క్వార్టర్స్‌లో అతను టాప్ సీడ్ లీ జీ జియాతో ఢీ కొనే అవకాశాలున్నాయి. మాలవిక బన్సోడ్, సైనా నెహ్వాల్‌లు మహిళల సింగిల్స్ డ్రాలో ఉన్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, బీ సుమీత్ రెడ్డిలు జంటగా పోటీ పడనున్నారు.