ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలడంతో ఒక చిన్నారి సహా నలుగురికి గాయాలయ్యాయి. శనివారం ఆషియానా పోలీస్ స్టేషన్ పరిధిలోని రిక్షా కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులందరినీ లోక్‌బంధు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ట్రామా సెంటర్‌కు తరలించారు.
ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఘటనలే జరిగాయి. గత నెలలో ఉత్తరప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాల్లో గోడ కూలిన సంఘటనలలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో లక్నోలో తొమ్మిది మంది, ఉన్నావ్‌లో ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా ఈ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇక.. నిన్న (శుక్రవారం) కూడా లక్నోలోని దిల్‌కుషా ప్రాంతంలో భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయింది. దీంతో మహిళలు, పిల్లలు సహా తొమ్మిది మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.