ఖమ్మం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రవాణా సంస్థ అయిన ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. అలాగే ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించడం, ఆ సంస్థలకు పిడుగుపాటు లాంటి అంశం అన్నారు. అలాగే ఈ నిర్ణయం ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు గొడ్డలిపెట్టు లాంటిదని చెప్పారు.
కలిసి వచ్చే వారితో ఐక్య పోరాటాలు
ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు అడుగులు ఇప్పుడే అడ్డుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అన్నారు. ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తారని, దీనిపై ప్రభుత్వం రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తోందని చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఐక్యపోరాటాలు అవసరమన్నారు. ఆర్టీసీ పరిరక్షించుకునేందుకు తాము ఉద్యమిస్తామని, కలిసి వచ్చే సంఘాలతో ఐక్యపోరాటాలు చేస్తామని చెప్పారు.