Friday, November 8, 2024

Spl Story | ఖమ్మం కదనరంగం.. పొంగులేటికి షాకులు, తుమ్మల కట్టడికి వ్యూహాలు

ఖమ్మం కదనరంగాన్ని తలపిస్తోంది. ఎన్నికల వేడి ఖమ్మం గుమ్మంలో సెగలు రాజేస్తోంది. సీట్లు తక్కువ.. నేతలు ఎక్కువ కావడంతో ఖమ్మం కారులో కలహాల మంటలు టెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను, తన టీమ్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయడం ఖాయమని స్పష్టత ఇవ్వడం, తెగతెంపుల సంకేతాలు ఇవ్వడంతో ప్రతి చర్యలు కూడా మొదలయ్యాయి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి : ఖమ్మంలో పొంగులేటి ఫ్లెక్సీలను మంత్రి పువ్వాడ అనుచరులు చింపేయగా, బుధవారం ఎస్కార్ట్‌ వాహనం తొలగించి భద్రతను కూడా 3ప్లస్‌ 3 నుండి 2ప్లస్‌ 2 కు తగ్గించారు. ఇవి పొంగులేటిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుండి పోటీ చేయవచ్చన్న సంకేతాలతో మంత్రి పువ్వాడ అలర్ట్‌ అయి.. తనపై కుట్రలు చేస్తున్నారని భగ్గుమన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2019 ఏప్రిల్‌ నుండి ఏ పదవి లేకున్నా.. అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ గ్రూపులు సృష్టిస్తున్నాడని, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదుచేశారు.

ఇక‌.. జిల్లాలో తిరుగుతూ వర్గాన్ని కాపాడుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికలలో ఖమ్మం, అశ్వారావుపేట, పినపాక, భద్రాచలం, మధిర అన్నిచోట్లా.. ప్రత్యామ్నాయాలు రెడీ చేసుకుంటున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అధిష్టానం పొంగులేటిపై చర్యల సంకేతాలు ఇవ్వడంతో పాటు జడ్పీఛైర్మన్‌ కోరం కనకయ్యపై అవిశ్వాసం పెట్టాలన్న నేతల డిమాండ్‌ ను పరిశీలిస్తోంది.

- Advertisement -

తుమ్మలది ఇంకోదారి..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ తొలిటర్మ్‌ పాలనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో శాసించగా, 2018 తర్వాత సీన్‌ రివర్స్‌ అయింది. పాలేరులో ఓటమి తర్వాత సీఎం కేసీఆర్‌ తుమ్మలను దూరం పెట్టగా, పార్టీ కార్యక్రమాలకు జిల్లా నేతలు ఆహ్వానించడం వదిలేశారు. పాలేరులో తుమ్మలపై గెలిచిన కందాల ఉపేందర్‌ రెడ్డి గులాబీగూటికి చేరగా, తుమ్మల కూడా నియోజకవర్గంలో తిరుగుతుండడంతో ఆయన అధిష్టానానికి ఫిర్యాదుచేశారు. సిట్టింగ్‌ లకే టికెట్లని పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించగా, తుమ్మల కొత్త ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.

సత్తుపల్లి నియోజకవర్గంలోనూ తనకు వ్యతిరేకంగా తుమ్మల పావులు కదుపుతున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహిరంగంగా ఆరోపిస్తున్నాయి. పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదుచేశారు. ఇల్లందులో హరిప్రియ నాయక్‌ తనకు వ్యతిరేకంగా జడ్పీఛైర్మన్‌ కోరం కనకయ్య పనిచేస్తున్నారని, పార్టీ లైన్‌ లో లేరని ఫిర్యాదుచేశారు. పినపాక నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తున్నారని, కోవర్టులారా.. ఖబడ్దార్‌ అంటూ అక్కడి ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్‌ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు మద్దతుగా ఈ నియోజకవర్గంలో పొంగులేటి పర్య టిస్తున్నారు.

కొత్తగూడెంలో స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయవచ్చన్న ప్రచారాన్ని అనుచరులు చేస్తున్నారు. వైరాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌ కు వ్యతిరేకంగా అన్ని మండలాల్లో మాజీ ఎమ్మెల్యే మదన్‌ లాల్‌ పార్టీ ఆఫీసులు తెరిచారు. బహిరంగ సవాళ్ళు.. కొట్లాటలు, కేసులు ఈ జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. కారులో గ్రూపులగోల అధిష్టానానికి తెలిసినా.. రిపేర్‌ ఎలా చేయాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. ఖమ్మం ఆంధ్రారాజకీయాలకు కూడా గుమ్మం కావడంతో.. ఇక్కడ టిడిపి చంద్రబాబు సభ ఇటీవల సక్సెస్‌ అయింది. ఎపి పార్టీలు కూడా కూడా ఖమ్మం రాజకీయాలపై కన్నేయగా.. ఇంకా కామ్రేడ్లు కూడా ఖర్చీఫ్‌ లు వేసి రెడీగా ఉన్నారు.

కారులో కయ్యాలతోనే సతమతమవుతుంటే వామపక్ష పార్టీల సారధులే ఉన్న మూడు జనరల్‌ స్థానాల్లో రెండింటిపై కన్నేశారు. పాలేరులో సీపీఎం, కొత్తగూడెంలో సిపిఐ బరిలో దూకేందుకు పావులు కదుపుతున్నాయి. వైఎస్సార్‌ టిపి అధినేత్రి షర్మిల కూడా పాలేరు నా బరి అని ప్రకటించారు. కార్యాలయ పనులు కూడా ప్రారంభించారు. మొత్తంగా ఖమ్మం కదనరంగం ఇపుడు కోలాహలంగా.. హాట్‌ హాట్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement