Tuesday, November 19, 2024

Khammam : పొంగులేటి స‌భ‌లో జై కాంగ్రెస్.. జై సీఎం అంటూ నినాదాల హోరు..

ఖమ్మం : ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపు రంగం సిద్ధమైంది. ఆ మేరకు శుక్రవారం ఖమ్మం నగరంలోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్ లో తన అనుచరులు, అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టత ఇచ్చారు. సుమారు 1000 మందికి పైగా పాల్గొన్న సమావేశంలో తొలుత జై సీఎం.. జై కాంగ్రెస్.. అంటూ నినాదాలతో సమావేశ ప్రాంగణం హోరెత్తింది. సమావేశంలో తొలుత ముఖ్య నేతల అభిప్రాయాలను నియోజకవర్గాల వారీగా సేకరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడు నుండి పదిమంది చొప్పున మాట్లాడే అవకాశం కలిగించి అభిప్రాయాలు సేకరించగా, ఎక్కువమంది కాంగ్రెస్ లో చేరాలంటూ సలహాలు ఇచ్చారు. కాంగ్రెస్ ద్వారానే సీఎం కేసీఆర్ ను గద్దె దించడం జరుగుతుందని, కాంగ్రెస్ లో చేరాలంటూ స్పష్టం చేశారు. అనంతరం మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని హర్షద్వానాలు, ఈలలు, కేకలు, చప్పట్ల మధ్య పేర్కొన్నారు. గడిచిన ఐదు నెలల పది రోజుల కాలంలో తనను ఎందరో హేళన చేసి అవమానకరంగా మాట్లాడారని, వాటన్నింటికీ ప్రజల అభిమానం, తన చిరునవ్వే సమాధానం చెప్తుందని పేర్కొన్నారు.

నాలుగైదు రోజులలోపే హైదరాబాద్ లో తాను పార్టీలో చేరిక అంశాన్ని అధికారికంగా తెలియజేస్తానని స్పష్టం చేశారు. తాను గతంలో వేరే ఇతర పార్టీలో చేరతానని భావించి కొందరు తెల్లవార్లు మందు పార్టీలు చేసుకుని తాగారని, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభిమానులందరి ఆలోచన ప్రకారం సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించడం ఏ పార్టీ ద్వారా సాధ్యమవుతుందో ఆ పార్టీలోనే చేరనున్నట్లు పేర్కొన్నారు. తనను విమర్శించిన వారి రాజకీయ భవిష్యత్తు త్వరలో కనుమరుగు కానుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనను ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. తన రాకతో మళ్ళీ ప్రజా ప్రతినిధులం కాలేమనే ఆందోళనలో కొందరు నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన క్యాంపు కార్యాలయానికి చేరుకొని అటు నుండి హైదరాబాద్ కు వెళ్లారు. సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement