Friday, November 22, 2024

బిట్లు… బిట్లు… రూల్స్ కు తూట్లు..

ఖమ్మం, ప్రభ న్యూస్‌ బ్యూరో: జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ – విజయవాడ (ఎన్‌హెచ్‌-9) జాతీయ రహదారిని కలుపుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి ఖమ్మం జిల్లా కేంద్రం వరకు 60 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న 4లైన్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అధికారికంగా కాగితాల్లో ఒక్కటే కాంట్రాక్టు పనిగా కనిపిస్తున్నా.. అనధికారికంగా మాత్రం అది బిట్లు బిట్లుగా మారి.. ముక్కలు ముక్కలుగా అనామకుల చేతుల్లోకి వెళ్లి అబాసుపాలవుతోంది. జాతీయ రహదారులకు ధీటుగా జిల్లాల మీదుగా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేల పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కూడా జాతీయ రహదారులుగా అంతర్‌ జిల్లాల రహదారులను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం మంచిదే. సూర్యాపేట-ఖమ్మం హైవే రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న లోపాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండడం విశేషం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) సిస్టంలో సూర్యాపేట- ఖమ్మం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నిర్మాణాలకు అనుమతి ఇస్తూ టెండర్లు కోరగా, ఆన్‌లైన్‌లో అదానీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్సు లిమిటెడ్‌ సంస్థకు టెండర్‌ రూ.1150 కోట్లకు దక్కింది. ముందుగా పెట్టుబడులు పెట్టి రోడ్డు నిర్మాణం చేపట్టిన అనంతరం టోల్‌గేట్‌ల ద్వారా పెట్టిన పెట్టుబడులతో పాటు లాభాలను సంస్థ 17 సంవత్సరాల కాల పరిమితితో వాహనదారుల నుండి కేంద్రం నిర్ణయించిన రేట్ల ప్రకారం వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటి బీవోటీ రోడ్డును గడువులోపు పూర్తి చేయాల్సిన అదానీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు సంస్థ ఇష్టం వచ్చినట్లుగా అర్హత, కనీస అనుభవం లేని అనామక కాంట్రాక్టర్‌లకు సబ్‌ లీజులకు ఇవ్వడంతో రోడ్డు పనులు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఒ కవైపు రోడ్ల ఫార్మేషన్‌ చేస్తుంటే.. మరోవైపు గండ్లు పడి, తెగిపోయి కొట్టుకు పోతుండడం రోడ్డు నాణ్యతా ప్రమాణాలకు నిదర్శనంగా మారింది.
అదానీ ఇన్‌ ఫ్రా నుండి
డీఎన్‌ఆర్‌ ఇన్‌ ఫ్రాకు అనధికారిక మార్పిడి
జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ద్వారా ఆన్‌లైన్‌ టెండర్‌ కాంట్రాక్టు పొందిన అదానీ ఇన్‌ ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌ సంస్థ తన అగ్రిమెంట్‌ అనుమతులు, అన్ని హక్కులను ఆ సంస్థతో ఖరారు చేసుకుని కర్ణాటకకు చెంది డీఎన్‌ఆర్‌ ఇన్‌ ఫ్రా ప్రాజెక్టు సంస్థకు సబ్‌ లీజుకు ఇచ్చింది. ఆ సంస్థ తెలంగాణలో హైవే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన అనుభవం లేకపోవడంతో అనధికారికంగా బజారులో వేలం పెట్టి 60 కిలోమీటర్ల వరకు నిర్మించాల్సిన గ్రీన్‌ ఫీల్డ్‌ 4లైన్‌ల హైవే రోడ్డును బిట్లు బిట్లుగా, ముక్కలు ముక్కులుగా చేసి సుమారు 20 మంది కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులిపేసుకుంది. పూర్తిగా బీవోటీ పద్ధతిలో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు వాహనదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రమాదాలకు అవకాశం ఇవ్వకుండా సౌకర్యవంతంగా 17 సంవత్సరాల కాలపరిమితి వరకు మెయింటినెన్స్‌ చేయల్సిన బాధ్యతలతో రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అటువంటి రోడ్డును అదానీ సంస్థ అడ్డగోలుగా, అనధికారికంగా ఎవరెవరికో ఇవ్వడం.. అర్హత లేని అనామక కాంట్రాక్టర్లు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతుండడం, వేసిన రోడ్డు గండ్లు పడి కొట్టుకుపోతుండడం, నల్లరేగడి మట్టి వాడరాదనే నిబంధనలు ఉన్నా.. వాడుతుండడం.. నేషనల్‌ హైవే అథారిటీ సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు పట్టించుకోకపోవడం అంతా జరిగిపోతూనే ఉంది.
నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా
నల్లరేగడి మట్టితో రోడ్డు పనులు
ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో సబ్‌ కాంట్రాక్టర్లుగా హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్న వారి సామర్థ్యాన్ని కూడా అదానీ సంస్థ కానీ, డీఎన్‌ఆర్‌ సంస్థ కానీ పట్టించుకోకపోవడంతో భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత అదానీ సంస్థ భరించాల్సి ఉంటుంది. రోడ్డు నిర్మాణంలో, ఫార్మేషన్‌ కోసం అసైన్డ్‌ భూములు, చెరువులు, కుంటలు, వాగుల వద్ద నుండి రోడ్డుకు ఉపయోగించడానికి వీలులేని నల్లరేగడి మట్టి తోలించి వాడుతూ ప్రజలకు రోడ్డు కారణంగా వచ్చే ప్రయోజనం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నారు. పెద్ద పెద్ద లోతైన కందకాలు, గుంటలు తీయడం వల్ల ప్రమాదాలు కలిగే పరిస్థితి ఉంటుందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు వేస్తుంటే మరోవైపు
గండ్లు పడి కొట్టుకుపోతున్న వైనం
జాతీయ రహదారి నిర్మాణంలో పరిశీలిస్తే లోపాలు అనేకం స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్డు ఫార్మేషన్‌ ఒకవైపు నుండి చేస్తుంటే మరోవైపు నుండి కొట్టుకుపోతుండడం, గండ్లు పడుతున్నాయి. తల్లంపాడు వద్ద నిర్మిస్తున్న అండర్‌ టన్నెల్‌ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డుకు పడిన గండ్లు అందుకు నిదర్శనం . ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధీరజ్‌ ఇన్‌ ఫ్రా కాంట్రాక్టు సంస్థతో పాటు అల్లం ఇన్‌ ఫ్రా తదితర సంస్థలు చేపడుతున్న పనులన్నీ అడ్డగోలుగా, నిబంధనలకు విరుద్దంగా సాగుతున్నాయి. వేల కోట్లతో, బీవోటీ పద్ధతిలో జరుగుతున్న ఈ పనులపై ప్రభుత్వాలు, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఐఏఐ) ప్రధానంగా దృష్టి సారించి సబ్‌ కాంట్రాక్టులను, అనమాక సంస్థలను తొలగించడం ద్వారా రోడ్డు ప్రమాణాలు పెంచి భవిష్యత్‌లో ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement