అమరావతి, ఆంధ్రప్రభ: పోలవరం నిర్మాణ పురోగతికి ప్రధాన ఆటంకంగా ఉన్న డయాఫ్రం వాల్‌పై ఈనెల 28న నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) కీలక నివేదిక ఇవ్వనుంది. 2020లో వచ్చిన భారీ వరదల ధాటికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేపట్టి పటిష్టం చేయటమా.. లేదంటే సమాంతరగా మరో డయాఫ్రం వాల్ నిర్మాణం చేయటమా అనే అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు ఈ నివేదికతో తెరపడనుంది. కేంద్ర జలశక్తితో పాటు పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ)కు అందించే తాజా అధ్యయన నివేదిక ఆదారంగా డయాఫ్రం వాల్ పై కేంద్ర జలశక్తి తుది నిర్ణయం తీసుకోనుంది. గతంలో గోపాలకృష్ణ కమిటీతో పాటు ఐఐటి ఢిల్లీ, హైదరాబాద్, తిరుపతి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బిఐఎస్) తదితర ప్రముఖ సంస్థలకు చెందిన ఇంజనీరింగ్ బృందాలు డయా ఫ్రం వాల్ పై అధ్యయనం చేసి నివేదికలు అందించినా వాటి ఆధారంగా కేంద్ర జలశక్తి తుది నిర్ణయం తీసుకోలేకపోయింది.
చివరకు నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఎన్ హెచ్ పీసీ బృందం డయాఫ్రం వాల్ ను అనేకసార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ మేరకు డయాఫ్రం వాల్ పటిష్టతపై సమగ్రమైన సిఫార్సులతో కూడిన అధ్యయన నివేదికను అందించనుంది. ఎన్ హెచ్ పీసీ నిపుణుల బృందం డయాఫ్రం వాల్ ను హై రిజల్యూషన్ జియో ఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సీస్మిక్ టోమోగ్రఫీ విధానాలతో పరీక్షలు నిర్వహించింది. ఎన్ హెచ్ పీసీ అధ్యయనం నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన పనులను సత్వరం ప్రారంభించే యోచనలో కేంద్ర జలశక్తి ఉంది. ఈ మేరకు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ చైర్మన్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని బృందం మార్చి 4న పోలవరంలో పర్యటించనుంది.
మరమ్మతులతో డయాఫ్రం వాల్ ను పటిష్టం చేయవచ్చని ఎన్ హెచ్ పీసీ నివేదిక అందిస్తే ఆ మేరకు ఏపీ జలవనరుల శాఖ అధికారులతో పాటు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మెఘా కంపెనీ ఇంజనీరింగ్ బృందానికి దిశా నిర్దేశం చేయనుంది. సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ నిర్మించాలని నివేదిక అందిస్తే గతంలో చేసిన అధ్యయనాల్లో భాగస్వామ్యమైన ఐఐటీ ఢిల్లీ, హైదరబాద్, తిరుపతికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులతో పాటు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులతో డీడీఆర్పీ బృందం మార్చి 5న చర్చించి ఆ తరువాత తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.